Kothagudem: పుస్తక పఠనంతోనే మేధాశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి

Kothagudem: కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక పఠనంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Nov 2026 5:30 PM IST
Kothagudem
X

Kothagudem: పుస్తక పఠనంతోనే జ్ఞాపకశక్తి పెంపు

కొత్తగూడెం: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెంలో పుస్తక పఠనంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ కార్యదర్శి కె. కరుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రంథపాలకుడు బాబు, చుంచుపల్లి ఉపాధ్యాయుడు రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా పుస్తక పఠనం అంతే అవసరమని అన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఇంటర్నెట్, వైఫై వంటి సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారని, పుస్తక పఠనం ద్వారా మేధాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతాయని వివరించారు. విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

గ్రంథాలయ కార్యదర్శి కె. కరుణకుమారి మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహిస్తూ, విద్యార్థులు, పాఠకులకు అవసరమైన అన్ని సదుపాయాలను గ్రంథాలయ చైర్మన్ ఆధ్వర్యంలో కల్పిస్తున్నామని తెలిపారు. పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలితకుమారి, జి. మణిమృదుల, గీత, మధుబాబు, గ్రంథాలయ సిబ్బంది వినోద్, ఈశ్వరి, దివ్య, పలువురు వక్తలు, పాఠకులు, విద్యార్థినీ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM