Kothagudem: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి.. మేయర్ మూడు గణేష్

Kothagudem: కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో అండర్-14, 17 జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలను మేయర్ మూడు గణేష్ ప్రారంభించి క్రీడా స్ఫూర్తితో ఆడాలని కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 19 Nov 2026 10:06 PM IST
Kothagudem
X

Kothagudem: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి.. మేయర్ మూడు గణేష్

కొత్తగూడెం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ తమ ప్రతిభను చాటుకోవాలని కొత్తగూడెం నగర మేయర్ మూడు గణేష్ అన్నారు. గురువారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన అండర్-14, అండర్-17 బాలబాలికల 70వ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి, క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. క్రీడా మైదానంలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని, తద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, ప్రతిరోజూ కొంత సమయం క్రీడా మైదానంలో గడపాలని సూచించారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM