Palwancha: పాల్వంచలో 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు పారదర్శకంగా లక్కీ డ్రా

Palwancha: పాల్వంచలో 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Updated on: 24 Sept 2026 9:58 PM IST
Kothagudem
X

Kothagudem: పాల్వంచలో 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు పారదర్శకంగా లక్కీ డ్రా

పాల్వంచ: లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 27 డివిజన్లకు చెందిన అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు పెద్దమ్మతల్లి ఆలయ ఫంక్షన్‌హాల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, మేయర్ మూడ్ మూడ్ గణేష్ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టారు.

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. పది బ్లాకుల్లో ఒక్కో బ్లాక్‌లో 36 ఇళ్ల చొప్పున మొత్తం 360 ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 27 డివిజన్ల నుంచి వీటి కోసం 4,611 దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో విచారణ, అర్హతల పరిశీలన అనంతరం 1,254 మందిని అర్హులుగా గుర్తించారు. అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్య కంటే అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లక్కీ డ్రా విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల కేటాయింపులో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్సీ వర్గానికి 17 శాతం మేరకు 61 ఇళ్లు, ఎస్టీ వర్గానికి 6 శాతం మేరకు 22 ఇళ్లు, మైనారిటీలకు 12 శాతం మేరకు 43 ఇళ్లు, మిగిలిన బీసీ, ఓసీ వర్గాలకు 65 శాతం మేరకు 234 ఇళ్లను కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో 3 మంది దివ్యాంగులకు, ఎస్టీ కేటగిరీలో ఒక దివ్యాంగుడికి, మైనారిటీ కేటగిరీలో 2 మంది దివ్యాంగులకు, బీసీ, ఓసీ కేటగిరీల్లో 12 మంది దివ్యాంగులకు ఇళ్లను కేటాయించేలా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు. మొత్తంగా 18 ఇళ్లు దివ్యాంగులకు, 342 ఇళ్లు ఇతర అర్హులకు కేటాయించే విధంగా ప్రక్రియ రూపొందించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గతంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న ఇళ్ల కంటే అర్హులైన దరఖాస్తుదారులు అధికంగా ఉన్నందున లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాల్సి వచ్చిందన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో ప్రక్రియ నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుని సమానంగా పరిగణించి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను కోరారు.

గతంలో కొంతమంది కుటుంబాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందుతాయనే హామీతో తమ నివాసాలను ఖాళీ చేసిన పరిస్థితులు ఉన్నాయని, అయితే ప్రస్తుత అర్హుల జాబితాలో వారి పేర్లు లేని విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అటువంటి కుటుంబాల సమస్యను ప్రస్తుత లక్కీ డ్రాతో కలపకుండా ముఖ్యమంత్రి లేదా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధానాన్ని అనుసరించడం ముఖ్యమన్నారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్కీ డ్రా ప్రక్రియను ప్రజల సమక్షంలో ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారిలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం కేటాయింపులు చేపడుతున్నట్లు తెలిపారు.

లక్కీ డ్రా పూర్తయిన అనంతరం ఎంపికైన లబ్ధిదారుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారని, అవసరమైన ధ్రువపత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల కేటాయింపు పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా, దళారులు సంప్రదించినా నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం జరుగుతున్నందున లబ్ధిదారులు ఎలాంటి మధ్యవర్తులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు లబ్ధిదారులు, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ మూడ్ గణేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్‌ల సమన్వయంతో లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా చూడాలన్నదే లక్ష్యమని చెప్పారు. ప్రస్తుత లక్కీ డ్రాలో ఇల్లు లభించని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌లో ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లలో నిబంధనల ప్రకారం వారికి అవకాశం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం చిన్నారుల చేతుల మీదుగా ముందుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. అనంతరం కేటగిరీల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టి, ఎంపికైన లబ్ధిదారులకు ధ్రువపత్రాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, మేయర్ మూడ్ మూడ్ గణేష్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కొత్తగూడెం ఆర్డీవో మధు, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కార్పొరేటర్లు, తహసీల్దార్ దారాప్రసాద్, గృహ నిర్మాణ శాఖ పీడీ సవేరాం, ఇందిరమ్మ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హులు, ప్రజలు సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN