Kothagudem: కొత్తగూడెంలో కామ్రేడ్ జాడి మంజుల సంతాప సభ నిర్వహణ!
Kothagudem: కొత్తగూడెంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకురాలు కామ్రేడ్ జాడి మంజుల సంతాప సభ. వి. సంధ్య, సాబీర్ పాషా, మచ్చా వెంకటేశ్వర్లు నివాళులు.
Kothagudem: కొత్తగూడెంలో కామ్రేడ్ జాడి మంజుల సంతాప సభ నిర్వహణ!
Kothagudem: అట్టడుగు దళిత కుటుంబంలో జన్మించి, ఉద్యమాల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించిన కామ్రేడ్ జాడి మంజుల విద్యార్థి, మహిళా, ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జాతీయ నాయకురాలు వి. సంధ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కొనియాడారు. 37 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె మరణించడం విప్లవ, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ జాడి మంజుల సంతాప సభను బుధవారం కొత్తగూడెంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండలం లింగగూడెంలో జన్మించిన మంజుల, పీడీఎస్‌యూ నాయకురాలిగా విద్యార్థి ఉద్యమంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి రాష్ట్రస్థాయికి ఎదిగారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, మహిళా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలకు సుపరిచితురాలిగా నిలిచారని పేర్కొన్నారు.
తన ధైర్యసాహసాలతో పాటు అన్యాయాన్ని ప్రశ్నించే తత్వంతో మంజుల ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఉద్యమాల్లో పాల్గొన్న క్రమంలో పలు కేసులు, నిర్బంధాలను ఎదుర్కొన్నారని, 2014లో ఆళ్లపల్లి పోలీసులు నమోదు చేసినట్లు పేర్కొన్న ఉపా కేసులోనూ ఆమె నిందితురాలిగా ఉన్నారని గుర్తుచేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో 37 ఏళ్లకే ఆమె మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కామ్రేడ్ మంజులకు నివాళులర్పించడం అంటే ప్రజా ఉద్యమాల్లో ఆమె ప్రదర్శించిన సాహసం, నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని పోరాటాలను కొనసాగించడమేనని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సింగ ఉపేందర్‌రావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. అనురాధ, జర్నలిస్ట్ ఎస్ఎల్. ముత్యం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, కండె లక్ష్మీనారాయణ, చార్వాక, పీడీఎస్‌యూ నాయకులు పృథ్వీ, సాంబ, గణేష్, ప్రణయ్, రాములమ్మతో పాటు కుటుంబ సభ్యులు జంపన్న, పూలే, లత, రజిత తదితరులు పాల్గొన్నారు.




