Kothagudem: సురక్షిత బాల్యం కోసం కృషి చేయాలి న్యాయమూర్తి రాజేందర్
Kothagudem: కొత్తగూడెంలో బాలల హక్కులు, పోక్సో చట్టంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు. సురక్షిత బాల్యం కోసం అందరూ కృషి చేయాలని న్యాయమూర్తి రాజేందర్ పిలుపు.
Kothagudem: సురక్షిత బాల్యం కోసం కృషి చేయాలి న్యాయమూర్తి రాజేందర్
భద్రాద్రి కొత్తగూడెం: బాలల హక్కులను పరిరక్షించడం, బాలలపై జరిగే నేరాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం. రాజేందర్ అన్నారు. సురక్షిత బాల్యం అభియాన్లో భాగంగా గురువారం కొత్తగూడెంలోని బాబు క్యాంపు పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు బాలల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల చేత బాలల రక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉపాధ్యాయులకు పోక్సో (POCSO) చట్టం, బాలల హక్కులు, బాలలపై జరిగే నేరాల నివారణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. బాలలపై జరిగే వేధింపులు, దోపిడీ, ఇతర అన్యాయాలను గుర్తించి, అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు తగిన చర్యలు తీసుకోవడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల హక్కులు, రక్షణ చట్టాలపై క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా తెలియజేసేలా పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
బాలల హక్కుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విద్యార్థుల భద్రత విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని న్యాయమూర్తి ఎం. రాజేందర్ పిలుపునిచ్చారు.




