Kothagudem: కొత్తగూడెం ఐడీఓసీలో బతుకమ్మ వేడుకలు.. కలెక్టర్ అంకిత్ పూజలు
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ ప్రాంగణంలో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పూజలు చేశారు.
Kothagudem: కొత్తగూడెం ఐడీఓసీలో బతుకమ్మ వేడుకలు.. కలెక్టర్ అంకిత్ పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం ఐడీఓసీ ప్రాంగణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ పండుగలో నాలుగో రోజు సందర్భంగా మంగళవారం నిర్వహించిన నానబియ్యం బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి సంబరాలను ప్రారంభించారు.
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఐడీఓసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమంతో పాటు ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యా చందన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో నానబియ్యం బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి జిల్లాలోని అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ శాఖల భాగస్వామ్యంతో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లా పంచాయతీ అధికారి అనూష మాట్లాడుతూ.. పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల జీవన సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.




