Kothagudem: హేమచంద్రాపురం రోడ్డు విస్తరణకు రైల్వే భూముల అప్పగింత
Kothagudem: కొత్తగూడెంలో 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ సమస్య ఎంపీ రఘురాం రెడ్డి చొరవతో రైల్వే భూముల అప్పగింతతో పరిష్కారమైంది.
Kothagudem: హేమచంద్రాపురం రోడ్డు విస్తరణకు రైల్వే భూముల అప్పగింత
కొత్తగూడెం: పట్టణ ప్రజలను దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణకు అవసరమైన రైల్వే భూములను రెవెన్యూ శాఖకు అప్పగించే ప్రక్రియ పూర్తయింది.
సుమారు 15 నుంచి 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమన్వయ సహకారంతో రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. మంగళవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సమక్షంలో రైల్వే భూములను రెవెన్యూ శాఖకు అప్పగించే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారి కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సమయంలో స్థానిక ప్రజలు హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
పట్టణ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సుమారు 15 నుంచి 16 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను సంబంధిత శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు.
ఈ ప్రక్రియలో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కీలక చొరవ చూపారని ఎంపీ తెలిపారు. రోడ్డు విస్తరణకు అవసరమైన రైల్వే భూముల సర్వే నిర్వహించడం, భూముల విస్తీర్ణం, మార్కెట్ విలువలను నిర్ధారించడం, భూముల మార్పిడికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయడంలో జిల్లా యంత్రాంగం సహకరించిందన్నారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో చర్చలు జరిపి సమస్యను వివరించగా, భూముల మార్పిడికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపిందని అన్నారు .
భూముల మార్పిడి ప్రక్రియలో భాగంగా కొత్తగూడెంలో రైల్వే శాఖకు చెందిన సుమారు 5,500 చదరపు గజాల భూమిని హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ కోసం రెవెన్యూ శాఖకు అప్పగిస్తున్నట్లు ఎంపీ వివరించారు. దీనికి ప్రతిగా ఖమ్మం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 4,500 చదరపు గజాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇరు ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను సంబంధిత శాఖల ద్వారా నిర్ధారించి, భూముల మార్పిడికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వుల ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. కొత్తగూడెంలో భూముల అప్పగింత ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సమక్షంలో ఖమ్మంలోనూ రైల్వే శాఖకు భూమిని అప్పగించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.
ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొత్తగూడెం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ తెలిపారు. అదేవిధంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి హేమచంద్రాపురం రోడ్డు విస్తరణకు రైల్వే భూముల అవసరాన్ని వివరించగా, భూముల మార్పిడి ప్రక్రియ వేగవంతం కావడానికి ఆయన సహకరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ, దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమన్వయంతోనే ఇన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగిందని తెలిపారు .
కొత్తగూడెం పట్టణ అభివృద్ధికి, ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఈ రోడ్డు విస్తరణ ఎంతో దోహదపడుతుందని ఎంపీ అన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనాల రాకపోకలు సులభతరమవుతాయని, వ్యాపార కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో..: మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య, రైల్వే రీజినల్ ఇంజనీర్ శశాంక్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసన్న కుమారి , సి పి ఐ పార్టీ జిల్లా నాయకులు సబీర్ పాషా, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైల్వే శాఖ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.




