Kothagudem: కొత్తగూడెం జీజీహెచ్‌లో మందుల కొరతపై బీజేపీ ఆగ్రహం!
Kothagudem: కొత్తగూడెం జీజీహెచ్‌లో మందులు, సెలైన్ల కొరతతో పేద రోగులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
Kothagudem: కొత్తగూడెం జీజీహెచ్‌లో మందుల కొరతపై బీజేపీ ఆగ్రహం!
కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGH లో పేద రోగులకు కనీస వైద్య సదుపాయాలు అందడం లేదని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ GGH జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా మోహన్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, సెలైన్ బాటిళ్లు అందుబాటులో లేకపోవడంతో పేద రోగులు బయట మెడికల్ షాపుల్లో సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. రోజువారీ కూలీ పనులతో కుటుంబాలను పోషించుకునే పేదలు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు.
జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు అందకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు.
ఆసుపత్రిలో అవసరమైన మందులు, సెలైన్ బాటిళ్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కనుకుంట్ల రాజమొగిలి రాయుడు నాగేశ్వరరావు, ఆదిమూల రాములు, నోముల రమేష్, కొత్తూరు శ్రీనివాస్, రాజమొగిలి, గూడ విజయ, గిరి,రవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




