Kothagudem: యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల్లో నలుగురు విజేతలు
Kothagudem: కొత్తగూడెంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027 జిల్లా స్థాయి పోటీల్లో నలుగురు యువతీ యువకులు విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
Kothagudem: యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల్లో నలుగురు విజేతలు
కొత్తగూడెం: యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027 స్టేజ్-2 జిల్లా స్థాయి పోటీలు గురువారం కొత్తగూడెంలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.
యువజన సర్వీసుల కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీల్లో అక్టోబర్ నెలలో జరిగిన ఆన్లైన్ పోటీల్లో పాల్గొని స్టేజ్-2కు అర్హత సాధించిన అభ్యర్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. సంధ్య, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. వనజ, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నియాజ్ పర్వీన్ షేక్ వ్యవహరించారు.
పోటీల్లో పినపాకకు చెందిన ఎం. శశి వర్ధన్ మొదటి స్థానం సాధించగా, భద్రాచలానికి చెందిన టి. సంగీత రెండో స్థానం, ఇల్లందుకు చెందిన జె. దీపిక మూడో స్థానం, ఇల్లందుకే చెందిన డి. సాయి ప్రియ నాలుగో స్థానం సాధించారు.
ఈ నలుగురు విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. అనూష తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆమె అభినందనలు తెలియజేశారు.




