Kothagudem: సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల సామూహిక సెలవు, ధర్మదీక్ష
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 2 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి ధర్మదీక్ష చేపట్టారు.
Kothagudem: సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల సామూహిక సెలవు, ధర్మదీక్ష
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణం ధర్నా చౌక్‌లో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి ధర్మదీక్ష చేపట్టారు. టీఎస్ సీపీఎస్ ఈయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని సుమారు 2 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని, పార్టీ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపరిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్నా సీపీఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ బస్సు యాత్ర నిర్వహించి ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు పెట్టి ధర్మదీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మూడు ప్రధాన తీర్మానాలు చేశారు. మేనిఫెస్టో ప్రకారం సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని, సీపీఎస్ రద్దు కమిటీలో టీఎస్ సీపీఎస్ ఈయూకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం వర్తింపజేయాలని, హెల్త్ స్కీం ట్రస్ట్ బోర్డులో సీపీఎస్ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని తీర్మానించారు. ఉద్యోగుల డీఏ బకాయిలతో పాటు భవిష్యత్తులో వచ్చే డీఏ, పీఆర్సీ బకాయిలను ఏకమొత్తంగా నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు గోరింట్ల సురేష్, నాగు నాయక్, జిల్లా నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొని ధర్మదీక్షకు సంఘీభావం తెలిపారు.




