Kothagudem: నిరుద్యోగ యువత ఆశయ సాధనకు కృషి చేస్తా
Kothagudem: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కొత్తగూడెంలో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Kothagudem: నిరుద్యోగ యువత ఆశయ సాధనకు కృషి చేస్తా
కొత్తగూడెం: నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి, పట్టభద్రుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా అనేక పోరాటాలు చేసిన తనకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. పేదరికం నుంచి వచ్చిన బీసీ బిడ్డగా, కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి పీహెచ్డీ సాధించిన వ్యక్తిగా పట్టభద్రులు తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో బీసీ వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని, బహుజన వర్గాల అభ్యున్నతికి ఆమె చేస్తున్న కృషికి పట్టభద్రులు మద్దతు తెలపాలని ఎన్నికల ఇన్చార్జి ఇస్మాయిల్ కోరారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆశయాలను అధికారంలోకి వచ్చిన పార్టీలు విస్మరించాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పక్కనపెట్టి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూసమస్యపై విశారదన్ మహారాజ్తో కలిసి మూడు రోజులపాటు దీక్ష చేపట్టి 400 కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. రోహిత్ వేముల చట్టం అమలు విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించామని గుర్తుచేశారు.
కొత్తగూడెం సింగరేణికి ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, ఇక్కడి బొగ్గు గనులను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం స్థానిక యువత భవిష్యత్తుకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీలు పూర్తి చేసిన పట్టభద్రులు కోల్బెల్ట్ ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. పోడు భూముల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
గతంలో హామీలు ఇచ్చి గెలిచిన ప్రజాప్రతినిధుల మాదిరిగా కాకుండా, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రులు తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డి. వీరన్న, ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి అనిత చౌదరి, రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడు ఎల్.కె. అశోక్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల క్రాంతి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చైతన్య, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి వాసం రామకృష్ణ దొర, పినపాక నియోజకవర్గ ఇన్చార్జి కోరెం గణేష్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాంకుడోతు రవి, ముసల రామకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు లకావత్ సురేష్, మహిళా విభాగం జిల్లా నాయకురాలు గాయత్రి తదితరులు పాల్గొన్నారు.




