Kothagudem: దళిత రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి
Kothagudem: కొత్తగూడెంలో జరిగిన డిహెచ్‌పిఎస్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో దళితులపై దాడులు అరికట్టాలని, హక్కుల సాధనకు పోరాటాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం తెలిపారు.
Kothagudem: దళిత రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి
కొత్తగూడెం: దళితులపై జరుగుతున్న దాడులు, అణచివేతలను తక్షణమే అరికట్టాలని, వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే. ఏసురత్నం డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో ధారా శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం జరిగిన దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నేటికీ సమాజంలో దళితులు అనేక రకాల వివక్షలను, సామాజిక అన్యాయాలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను పాలకులు చిత్తశుద్ధితో, కఠినంగా అమలు చేయాలని కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
హక్కుల సాధనకు, దళితుల అభ్యున్నతికి డిహెచ్‌పిఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, రాష్ట్ర సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మామిడాల ధనలక్ష్మి, ఉర్సు రామకృష్ణ, కార్పొరేటర్ ఎర్రబెల్లి శంకర్, ధార లక్ష్మి, నాగమణి, పల్నాటి వీణ, రోజా, రాధారపు లింగేష్, పాల రవి, వాసు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




