Kothagudem: అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తా: డా. గడల శ్రీనివాసరావు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెకు జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Nov 2026 7:30 PM IST
Kothagudem
X

Kothagudem: అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తా: డా. గడల శ్రీనివాసరావు!

కొత్తగూడెం: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఐదు రోజులుగా కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్లుగా NHM ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని, వారి సమస్యలు, కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా వారి సమ్మె పరిస్థితి తనను బాధించిందని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

అవసరం లేని పథకాలను తీసుకొస్తున్న ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న NHM ఉద్యోగుల సమస్యలను మాత్రం ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే వారితో కలిసి పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మిరియాల రామకృష్ణతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM