Kothagudem: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద సీఐటీయూ మెరుపు ధర్నా
Kothagudem: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద సీఐటీయూ మెరుపు ధర్నా. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 దసరా బోనస్ వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్.
Kothagudem: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద సీఐటీయూ మెరుపు ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రకటించిన రూ.5,500 దసరా లాభాల బోనస్‌ను వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం హెడ్ ఆఫీస్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పండుగ వేళ కార్మికులకు బోనస్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ప్రకటించిన రూ.5,500 బోనస్‌ను దసరా పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, జీఎస్టీ పేరుతో కాంట్రాక్టర్లు చెల్లింపులు నిలిపివేశారని ఆరోపించారు. యాజమాన్యం చర్చలు జరిపినప్పటికీ కార్మికులకు బోనస్ అందకపోవడంతో పండుగ రోజున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
సింగరేణి చరిత్రలో లాభాల బోనస్ ప్రకటించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల చెల్లింపులోనూ జాప్యం జరుగుతోందని, దీనిపై సింగరేణి యాజమాన్యం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
బుధవారం సాయంత్రంలోగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ చేయాలని, లేనిపక్షంలో సింగరేణి హెడ్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూక్య రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి మాతంగి రాజేష్, నాయకులు ఎన్. రమేష్, ప్రమోద్, శివ, గడల నరసింహారావు, ఎన్.ఎస్. రాజు, మహమ్మద్ నసూర్ తదితరులు పాల్గొన్నారు.




