Kothagudem: కొత్తగూడెంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ!

Kothagudem: నల్గొండలో జరిగే ఏఐకేఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కొత్తగూడెంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతు సంఘం ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Nov 2026 5:27 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ!

కొత్తగూడెం: అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి 18 వరకు నల్గొండలో నిర్వహించనున్న జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం నుంచి సెంటర్ వరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు నల్గొండలో జరిగే నాలుగు రోజుల జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, 10 వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఏఐకేఎస్ రైతుల గిట్టుబాటు ధరల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు.

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను భూమి నుంచి వేరు కాకుండా కాపాడేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై జాతీయ మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాల అమలు ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రైతులను ఉద్యమాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. రైతులతో పాటు వ్యవసాయ రంగ సంక్షేమాన్ని కోరుకునే ప్రజలంతా నవంబర్ 15న నల్గొండకు తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, సీఐటీయూ జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, వీర్ల రమేష్, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కున్సోత్ షణ్ముఖ, రైతు సంఘం మండల నాయకులు నల్లగొపు పుల్లయ్య, బచ్చలకూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM