Kothagudem: కొత్తగూడెంలో 10+2 కోర్టు భవనాల నిర్మాణానికి వినతి
Kothagudem: కొత్తగూడెంలో 10+2 కోర్టుల నూతన భవనాల నిర్మాణానికి హైకోర్టు జస్టిస్ కె. సుజనకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ వినతిపత్రం ఇచ్చారు.
Kothagudem: కొత్తగూడెంలో 10+2 కోర్టు భవనాల నిర్మాణానికి వినతి
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 10+2 కోర్టుల నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని జిల్లా న్యాయవాదుల సంఘం ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదుల్కర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం హైకోర్టు జస్టిస్, జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ కె. సుజనను ఆమె ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది.
గతంలో కోర్టుల నిర్మాణం కోసం కేటాయించిన సింగరేణి మ్యాగజైన్ సమీపంలోని, సంత పక్కన ఉన్న 10 ఎకరాల స్థలంలో 10+2 కోర్టుల నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని వారు కోరారు. జిల్లాలోని కోర్టుల్లో న్యాయమూర్తుల కొరతతో పాటు, న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల సమస్యలను జస్టిస్ సుజన దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాకు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోర్టులు, ఫ్యామిలీ కోర్టు, ఎక్సైజ్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ కె. సుజన తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
అనంతరం జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భీమపాక నగేష్, జస్టిస్ కాజా శరత్‌లను కూడా న్యాయవాదుల బృందం కలిసి జిల్లాలోని న్యాయపరమైన సమస్యలు, కోర్టుల అవసరాలను వివరించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి, కార్యవర్గ సభ్యులు కె. సంజీవరావు, జి. నాగరాజు, బి. దేవదాస్, బార్ అసోసియేషన్ సలహాదారు రమేష్ కుమార్ మక్కడ్, న్యాయవాదులు భాగం మాధవరావు, పి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




