Kothagudem: అంబేద్కర్‌పై అభ్యంతరకర ప్రచారం హమారా ప్రసాద్‌పై చర్యలకు డిమాండ్

Kothagudem: కొత్తగూడెంలో అంబేద్కర్‌పై అభ్యంతరకర ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని బహుజన సంఘాల నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Sept 2026 7:24 PM IST
Kothagudem
X

Kothagudem: అంబేద్కర్‌పై అభ్యంతరకర ప్రచారం హమారా ప్రసాద్‌పై చర్యలకు డిమాండ్

కొత్తగూడెం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అభ్యంతరకరంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో బుధవారం బహుజన నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.

సోషల్ మీడియా వేదికగా అంబేద్కర్‌పై ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాస్తున్నట్లు, ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు హమారా ప్రసాద్ ప్రచారం చేసుకుంటున్నారని నాయకులు తెలిపారు. అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్న ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఈ వ్యవహారంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

దళిత సంఘం సీనియర్ నాయకులు జేబీ బాలశౌరి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హమారా ప్రసాద్, హైందవ ప్రసాద్ వెనుక ఉన్నారని ఆరోపిస్తున్న సూత్రధారులను గుర్తించి విచారణ జరపాలని కోరారు.

ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్ మాట్లాడుతూ.. సమాజంలో విఘాతం కలిగించేలా ఉన్న చర్యలను ప్రభుత్వం, అధికారులు గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మల్లెల రామనాథం మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బహుజనులు, పీడితులు, దళితుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

బీసీ సంఘం జిల్లా నాయకులు కురిమెళ్ల శంకర్ మాట్లాడుతూ.. హమారా ప్రసాద్‌ను పావుగా ఉపయోగించి సమాజంలో మత కల్లోలం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబేద్కర్‌వాదాన్ని, రాజ్యాంగ విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు.

మాదిగ జేఏసీ నాయకులు మోదుగు జోగారావు మాట్లాడుతూ.. ఈ పరిణామాలపై అన్ని వర్గాల ప్రజలు స్పందించాలని కోరారు. వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. సమాజంలో అశాంతికి దారితీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

పత్రికా సమావేశం అనంతరం హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక జిల్లా నాయకులు వేల్పుల భాస్కర్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు, మాదిగ యువజన జిల్లా నాయకులు గడ్డం రాజశేఖర్, బీసీ సంఘం రాష్ట్ర యువజన నాయకులు మెట్టెల సైదుబాబు, అంబేద్కర్ యువజన జిల్లా నాయకులు నరాల రాజేష్, మాదిగ సంఘం నాయకులు గుండేటి వెంకట రాములు, మురిపిటి రాములు, మురిపిటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM