Kothagudem: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్

Kothagudem: స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు 27 పతకాలతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారు. ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 30 Sept 2026 7:15 PM IST
Kothagudem
X

Kothagudem: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్

కొత్తగూడెం: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచి 111 పాయింట్లతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.జిల్లా క్రీడాకారులు వివిధ విభాగాల్లో 12 బంగారు, 9 వెండి, 6 కాంస్య పతకాలు సాధించి మొత్తం 27 పతకాలు సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ విజేతలైన యువ క్రీడాకారులను అభినందించారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తూ కనీస వసతులు, సదుపాయాలు అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టడం ఎంతో గర్వకారణమని అన్నారు.క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో పాటు చదువుపై కూడా సమానమైన శ్రద్ధ చూపుతూ విద్యలోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని సూచించారు.

జిల్లా యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటిన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM