Kothagudem: లాభాల వాటాపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఏఐటీయూసీ!
Kothagudem: సింగరేణి లాభాల వాటా పెంచకపోవడంపై ఏఐటీయూసీ నేతలు మండిపడ్డారు. రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే బొగ్గు సరఫరా నిలిపివేస్తామని కొత్తగూడెంలో హెచ్చరించారు.
Kothagudem: లాభాల వాటాపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఏఐటీయూసీ!
కొత్తగూడెం: సింగరేణి కార్మికులకు లాభాల వాటా పెంచకుండా గత ఏడాది ఇచ్చిన 34 శాతానికే పరిమితం చేయడంపై ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంస్థ వాస్తవ లాభాలను వెల్లడించి, కార్మికులకు న్యాయమైన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
బుధవారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం రూ.1,754 కోట్ల లాభాలనే ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. లాభాల వాటా నిర్ణయించే ముందు గుర్తింపు కార్మిక సంఘంతో చర్చించకపోవడాన్ని తప్పుబట్టారు. కార్మికుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు.
*రూ.59 వేల కోట్ల బకాయిలు వసూలు చేయాలి*
సింగరేణికి జెన్కో, ట్రాన్స్కో నుంచి సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఈ బకాయిల వసూలు కోసం విద్యుత్ సౌధ ముట్టడి చేపట్టామని, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేసి, అవసరమైతే జెన్కో, ట్రాన్స్కోకు బొగ్గు సరఫరా నిలిపివేసే దిశగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
*24 డిమాండ్లను పరిష్కరించాలి*
సమ్మె నోటీసులో పేర్కొన్న 24 డిమాండ్ల పరిష్కారానికి కుదిరిన ఒప్పందాన్ని నిర్ణీత గడువులో అమలు చేయాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి, కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యం దృష్టి సారించాలని సూచించారు. సీఎస్ఆర్ నిధులను సింగరేణి ప్రాంతాల్లోనే వినియోగించి స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులు, సింగరేణి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు ఎస్.వి. రమణమూర్తి, జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్తో పాటు పలువురు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.




