Kothagudem: సింగరేణి దీక్షలు.. డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలి

Kothagudem: కొత్తగూడెంలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరగా, మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు ఉద్యోగాలు, రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 19 Nov 2026 6:27 PM IST
Kothagudem
X

Kothagudem: సింగరేణి దీక్షలు.. డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలి

కొత్తగూడెం: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర నాయకులు వంగ వెంకట్ మాట్లాడుతూ మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జీతభత్యాలు చెల్లించకుండా ఖాళీగా ఉంచడం అన్యాయమని అన్నారు. మెడికల్ ఫిట్ అయిన రోజు నుంచే జీతభత్యాలు చెల్లించాలని, లేదంటే తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.

కార్మికులు ఇన్వాలిడేషన్ అయిన వెంటనే టెర్మినల్ బెనిఫిట్స్ అందక, వారి వారసులకు ఉద్యోగాలు రాక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. సుమారు 200 మంది డిపెండెంట్లు మెడికల్ ఫిట్ అయినప్పటికీ ఉద్యోగ నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మెడికల్ బోర్డుల పేరుతో కాలయాపన చేయకుండా గతంలో మాదిరిగా 100 శాతం ఇన్వాలిడేషన్ విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు.

అదేవిధంగా టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం ఏఐటీయూసీ నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయంలో డీజీఎం (పర్సనల్) రాజగోపాల్‌ను కలిసి కార్మికుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ముఖ్య సలహాదారు శేషయ్య, కేంద్ర ప్రచార కార్యదర్శి జి. వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్, కత్తెర్ల రాములు, సహాయ కార్యదర్శి రాము, ఇతర యూనియన్ నాయకులు, పిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM