Kothagudem: వెట్టి చాకిరి, బానిసత్వ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Kothagudem: వెట్టి చాకిరి నిర్మూలనకు ‘స్వేచ్ఛా ధనం’ ప్రచార రథాన్ని ప్రారంభించిన కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్. సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 080-69434343.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 23 Oct 2026 4:58 PM IST
Kothagudem
X

Kothagudem: వెట్టి చాకిరి, బానిసత్వ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సమాజంలో కొనసాగుతున్న వెట్టి చాకిరి, బానిసత్వం వంటి అమానవీయ దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు, వారి శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం అందేలా చూడాలని సూచించారు.

వెట్టి చాకిరి నిర్మూలనపై కార్మిక శాఖ రూపొందించిన వాల్ పోస్టర్‌ను శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అసంఘటిత రంగ కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెట్టి చాకిరి మానవ హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అమానవీయ విధానమని పేర్కొన్నారు. కార్మికులను బలవంతంగా పనులు చేయించడం, శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించకుండా పనిచేయించుకోవడం, వారి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని శ్రమను దోపిడీ చేయడం వంటి చర్యలను అరికట్టాలని అన్నారు. ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన *‘స్వేచ్ఛా ధనం’ రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమం* ద్వారా వెట్టి చాకిరి నిర్మూలన, బాధితుల గుర్తింపు, పునరావాసం, కార్మిక హక్కులపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు ఇతర పని ప్రదేశాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రచార రథం ద్వారా అవగాహన కల్పించనున్నారు. వెట్టి చాకిరికి గురవుతున్న వారు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, చట్టపరమైన సహాయం పొందేందుకు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ సూచించారు.

వెట్టి చాకిరికి సంబంధించిన ఫిర్యాదులు, సహాయం కోసం *080-69434343* టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. కార్మికుల శ్రమకు గౌరవం, తగిన ప్రతిఫలం అందేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. వెట్టి చాకిరి, బానిసత్వ నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, యజమానులు, కార్మికులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్మిక కమిషనర్ శ్యామల ప్రమోద్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కె. శ్రీరామ్, సహాయ కార్మిక అధికారులు బి. నాగరాజు, పి.వి.కె. శాస్త్రి, ఎ. యేసుపాదం, చి. రజిత, ఏహెచ్‌టీఓ బృందం, ఏఐడీ ఎన్‌జీఓ ప్రతినిధులు, ఐజేఎం ప్రచార సాధకులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM