Kothagudem: రూ.7.20 కోట్లతో 72 సమాఖ్య భవనాలు ఎమ్మెల్యే కూనంనేని చొరవ

Kothagudem: కొత్తగూడెం నియోజకవర్గంలో మహిళా సాధికారతే లక్ష్యంగా రూ.7.20 కోట్లతో 72 గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణం. ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Nov 2026 4:20 PM IST
Kothagudem
X

Kothagudem: రూ.7.20 కోట్లతో 72 సమాఖ్య భవనాలు ఎమ్మెల్యే కూనంనేని చొరవ

కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళల సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదన్న సదుద్దేశంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవ చూపి నియోజకవర్గానికి 72 గ్రామ సమాఖ్య (వివో) భవనాలను మంజూరు చేయించారు. ఒక్కో భవనానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 7 కోట్ల 20 లక్షల వ్యయంతో వీటి నిర్మాణాలను చేపట్టారు.

నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ఈ భవనాలను కేటాయించగా, సుజాతనగర్ మండలానికి 13 భవనాలు మంజూరు కాగా ఇప్పటికే ఒక భవనం పూర్తయి ప్రారంభం కాగా మరో 8 తుది దశకు చేరుకున్నాయి, నాలుగు భవనాల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. చుంచుపల్లి మండలంలో 17 భవనాలకు గాను 2 ఇన్‌క్లైన్ వెంకటేశ్వర కాలనీ, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో రెండు భవనాలు ప్రారంభం కాగా మరో 14 భవనాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి, ఒక భవన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.

లక్ష్మీదేవిపల్లి మండలంలో 21 భవనాలకు 9 భవనాలు, పాల్వంచ మండలంలో 21 భవనాలకు గాను 14 భవనాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి, మిగిలిన భవనాల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపనలు జరగనున్నాయి. మంజూరైన 72 భవనాల్లో ఎక్కడైనా స్థల సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కూనంనేని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి రాబోయే మూడు నాలుగు నెలల్లోగా మొత్తం భవనాలను పూర్తి చేసి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

గ్రామీణ మహిళలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కూడా సొంత భవనాలు సమకూర్చేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా త్వరలోనే పట్టణ ప్రాంత సమాఖ్యల కోసం మరో 50 నూతన భవనాలను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ఊపిరిగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

మాటలకంటే చేతలకు ప్రాధాన్యతనిస్తూ, కోట్లాది రూపాయల నిధులను రాబట్టి కొత్తగూడెం రూపురేఖలను సమూలంగా మారుస్తున్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచుతూ, వారి ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాదులు వేస్తున్న దార్శనిక నేతగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందిస్తున్న ఈ విశేష సేవలు నియోజకవర్గ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. మహిళా సాధికారత కోసం ఇంతటి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చొరవ పట్ల నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM