Kothagudem: స్కాడాతో 54 సబ్‌స్టేషన్ల అనుసంధానం ఎస్ఈ మహేందర్ వెల్లడి

Kothagudem: విద్యుత్ అంతరాయాల నివారణకు కొత్తగూడెం సర్కిల్‌లో 54 సబ్‌స్టేషన్లు స్కాడా, ఆర్టీఎఫ్‌ఎంఎస్‌తో అనుసంధానం. వివరాలు వెల్లడించిన ఎస్ఈ మహేందర్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Oct 2026 9:37 PM IST
Kothagudem
X

Kothagudem: స్కాడాతో 54 సబ్‌స్టేషన్ల అనుసంధానం ఎస్ఈ మహేందర్ వెల్లడి

కొత్తగూడెం: విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్‌ (ఆర్టీఎఫ్‌ఎంఎస్‌)ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని 54 సబ్‌స్టేషన్లను స్కాడా వ్యవస్థతో అనుసంధానం చేయగా, మరో 7 సబ్‌స్టేషన్లలో పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.

ఆర్టీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా విద్యుత్ ఫీడర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని ఎస్ఈ వివరించారు. విద్యుత్ అంతరాయాలు, ఓవర్‌లోడ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి సమస్యలను తక్షణమే గుర్తించి, సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చన్నారు. తద్వారా సమస్యలను వేగంగా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

స్కాడా కంట్రోల్ రూమ్ నుంచే విద్యుత్ సరఫరా పరిస్థితిని రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం, ఫీడర్లలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అలర్ట్‌లు పొందడం, లోడ్‌, వోల్టేజ్ స్థాయిలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ప్రయోజనాలని తెలిపారు. సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ అంతరాయ సమయాన్ని తగ్గించవచ్చన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ కృషి చేస్తోందని గొట్టిముక్కుల మహేందర్ స్పష్టం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM