Khammam: జర్నలిస్టుల స్థలాల కోసం డిసెంబర్ 5 నుండి నిరాహార దీక్ష
Khammam: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్‌తో డిసెంబర్ 5 నుండి 9 వరకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు TWJF జిల్లా నేతలు వెల్లడించారు.
Khammam: జర్నలిస్టుల స్థలాల కోసం డిసెంబర్ 5 నుండి నిరాహార దీక్ష
ఖమ్మం: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం టిడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే చారిత్రక పాదయాత్ర నిర్వహించామని డిసెంబర్ 5 నుండి 9వ తేదీ వరకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
యూనియన్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. డిసెంబర్ 5 నుండి మొదలయ్యే ఈ నిరాహార దీక్షలు 9వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రకటించారు. 9వ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజు నాటికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రానిపక్షంలో ఈ నిరాహార దీక్షలను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.
అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై ఇప్పటికే వివిధ రూపాలలో పోరాటాలు నిర్వహించిందని దీనిలో భాగంగా ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై పదే పదే ప్రకటనలు హామీలు ఇస్తున్నాయి తప్ప వాటిని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుండడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
జర్నలిస్టుల నివాస స్థలం కోసం చేసే నిరాహార దీక్షలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నామన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలోనూ జాప్యం చోటు చేసుకుంటుందని అన్నారు. ఈ ప్రక్రియ చేపట్టి ఆరు నెలలైనా అర్హులైన జర్నలిస్టులు కొందరికి ఇప్పటికీ అక్రిడిటేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందనే పేరుతో డిపిఆర్ఓ జాప్యం చేస్తుండడాన్ని నిరసిస్తూ ఈనెల 23న సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టినట్లు వెల్లడించారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ పదేళ్ల ఆడిటింగ్ చేపట్టి, అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే టీడబ్ల్యూజెఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. దీనిపై విచారణకు డిపిఆర్ఓ, జిల్లా సహకార అధికారికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఖండించారు.
ఈ విషయమై జిల్లా సహకార అధికారి, డిపిఆర్ఓ సంయుక్తంగా విచారణ చేపట్టి ఎన్నికలు నిర్వహించకపోతే మరో మారు ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నలుబోల మధుశ్రీ, టీబీజేఏ జిల్లా కార్యదర్శి మానుకొండ రవి కిరణ్, కోశాధికారి రంగు అయ్యప్ప, టీబీజేఏ కెమెరామన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫయాజ్, గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్షులు తురగ రాజేంద్రమూర్తి, అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ హర్షద్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు, యూనియన్ ప్రచార కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, సభ్యులు బంకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




