Khammam: బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్!
Khammam: బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని, పర్యాటక పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ ఆదేశించారు.
Khammam: బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్!
ఖమ్మం, అక్టోబర్ -13: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బతుకమ్మ వేడుకల నిర్వహణతో పాటు పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, నిధుల సమీకరణ, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇట్టి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. వేడుకలు జరిగే ప్రదేశాల్లో పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పార్కింగ్, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విస్తృతంగా సేకరించి, ప్రచారం చేయాలని కలెక్టర్లకు సూచించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
బతుకమ్మ పాటల ద్వారా సూపర్ ఎల్‌నినో పై అవగాహన కల్పించాలి:
ప్రస్తుత సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయం, పర్యావరణంపై ప్రభావాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎ. వాణీ ప్రసాద్ సూచించారు. బతుకమ్మ పాటల పోటీలను నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి అంశాలు పాటల్లో ప్రతిబింబించేలా చూడాలన్నారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన సందేశాలతో పాటలు రూపొందించేలా ప్రజలను, మహిళా సంఘాలను, యువతను ప్రోత్సహించాలని తెలిపారు. బతుకమ్మ వేడుకలను సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించే వేదికగా కూడా వినియోగించుకోవాలని సూచించారు.
పర్యాటక అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి :
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56 పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను జిల్లాలకు బదిలీ చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాకు 20, ఖమ్మం జిల్లాకు 12 ప్రాజెక్టులను అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను సంబంధిత స్థానిక ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో చేపట్టి, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను పరిశీలించి, వాటి పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఇంజినీరింగ్ శాఖలకు పనుల బాధ్యతలు అప్పగించి, పనుల అమలు, నాణ్యత, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే సంబంధిత బిల్లులను పర్యాటక కార్పొరేషన్‌కు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రెండు వారాల్లోగా డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాలి:
పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) సిద్ధం చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు. అవసరమైన చోట కన్సల్టెన్సీ సహకారం కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతి జిల్లాలో సంబంధిత ప్రాజెక్టుల డీపీఆర్ తయారీ బాధ్యతలను రెండు వారాల్లోగా ఇంజినీరింగ్ శాఖలకు లేదా తగిన సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరిధి, భూమి లభ్యత, నిర్మాణ పనులు, అవసరమైన మౌళిక సదుపాయాలు, అంచనా వ్యయం, నిధుల సమీకరణ, అమలు గడువు వంటి అంశాలను డీపీఆర్‌లో స్పష్టంగా పొందుపరచాలని సూచించారు.
హరిత హోటళ్ల పూర్తికి పీపీపీ విధానంలో చర్యలు :
కొన్ని జిల్లాల్లో హరిత హోటళ్ల నిర్మాణ పనులు పాక్షికంగా పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన పనులను పూర్తి చేసి వాటిని నిర్వహణలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎ. వాణీ ప్రసాద్ తెలిపారు.
ప్రైవేట్ పెట్టుబడిదారుల సహకారంతో నిర్మాణ పనులను పూర్తి చేసి, నిర్దిష్ట కాలం పాటు నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
నిధుల వనరులను పరిశీలించి పర్యాటక ప్రణాళిక రూపొందించాలి:
ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి, సమగ్ర ప్రణాళికతో పాటు ఆకర్షణీయమైన ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు. జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు, వారసత్వ ప్రదేశాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన భూమి, మౌళిక సదుపాయాలు, అంచనా వ్యయం, అమలు విధానం, పర్యాటకుల సౌకర్యాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు.
పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రైవేట్ పెట్టుబడులు వంటి అన్ని అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మరుగు దొడ్లు, పార్కింగ్, వసతి, సమాచార బోర్డులు, భద్రత వంటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, స్థానిక ఆహార సంస్కృతిని పర్యాటకంతో అనుసంధానం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్నారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని నియమించాలి :
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎ. వాణీ ప్రసాద్ సూచించారు. ఈ మేరకు జిల్లాలకు పంపిన పర్యాటక ప్రాంతాల జాబితాను పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో భద్రతా సిబ్బందిని నియమించే చర్యలు జిల్లా స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు.
పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు, సంబంధిత శాఖల సమన్వయంతో పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




