Khammam: ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ సమ్మేళనంలో అరుదైన గురుశిష్యుల కలయిక!
Khammam: ఖమ్మం ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యను ఆయన గురువు శేషయ్య సత్కరించారు.
Khammam: ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ సమ్మేళనంలో అరుదైన గురుశిష్యుల కలయిక!
ఖమ్మం, అక్టోబర్ 16: స్థానిక ఎస్ఆర్అండ్ బిజిఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఆ కళాశాల పూర్వ విద్యార్థులు శుక్రవారం 2వ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 70 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ కళాశాల నుండి ప్రతి ఏటా వేలాదిమంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర దేశాలలో ఉద్యోగాలు పొంది తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు.
మరి కొంతమంది విద్యార్థులు రాజకీయ రంగంలోనూ విప్లవోద్యమాలలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు నల్లమోతు తిరుమలరావు అధ్యక్షతన నిర్వహించిన పూర్వ విద్యార్థుల ద్వితీయ మహా సమ్మేళనంలో అనేక రంగాలలో ప్రతిభ కనపరిచిన పూర్వ విద్యార్థులను ఆ సంఘం సన్మానించింది.
జర్నలిస్ట్ వృత్తిలో అత్యంత ప్రతిభ కనబరిచిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి కట్టెకోల చిన నరసయ్యను సమ్మేళనం సభలో కార్యవర్గం సత్కరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నరసయ్య గురువు శేషయ్య సారు నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1970 సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అప్పట్లో కట్టెకోల చిన నరసయ్య ఆ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు.
శేషయ్య సార్ కు నరసయ్య ప్రియ శిష్యుడు. అయితే శేషయ్య సారు నరసయ్య ఇరువురు ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు. ఈ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన శేషయ్య సార్ స్వయంగా నరసయ్యకు శాలువా కప్పి మెమెంటో అందజేసి సత్కరించటంతో నరసయ్య ఆనందంతో ఉద్వేగ భరితుడై సారుకు పాదాభివందనం చేశారు. గురు శిష్యులు ఒకే కళాశాలలో చదివిన వారై ఒకే వేదికపై కలుసుకోవడం పైగా గురువు శిష్యుడికి సన్మానం చేయడంతో పలువురు వారిని అభినందించారు.
నేనెంతో అదృష్టవంతుడిని స్వయంగా తన గురువే తనకు సన్మానం చేయడంతో ఆ శిష్యుడు ఆనందం అంతా ఇంత కాదు. ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాలలో ఆ కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో కట్టెకోల చిన నరసయ్యను తన చిన్ననాటి గురువైన శేషయ్య సారు వేదికపై వచ్చి సన్మానించడంతో నరసయ్య ఆనందంలో మునిగిపోయాడు. స్వయంగా తన గురువే తనకు సన్మానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని నేనెంతో భాగ్యవంతుడనని ఈ సందర్భంగా సన్మాన గ్రహీత విలేకరులకు తెలిపారు.




