Khammam: ఖమ్మంలో సోమవతి అమావాస్య వేళ గోశాలలకు గోదాణా వితరణ!

Khammam: ఖమ్మంలో సోమవతి అమావాస్య సందర్భంగా శ్రీ స్తంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ గోశాలలకు రూ.74 వేల విలువైన గోదాణాను దాతల సహకారంతో పంపిణీ చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Nov 2026 7:01 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో సోమవతి అమావాస్య వేళ గోశాలలకు గోదాణా వితరణ!

ఖమ్మం, నవంబర్ 9: శ్రీ పరాభవ నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ అమావాస్య, దీపావళి పర్వదినంతో కూడిన సోమవతి అమావాస్యను పురస్కరించుకొని శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ గోశాలలకు సోమవారం గోదాణా వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగర పెద్దలు, గోప్రేమికులు, రుక్మిణి సిల్క్స్ యాజమాన్యం, స్థానిక దాల్ మిల్ యజమానులు, ఛాంబర్ లోని వివిధ వ్యాపార వర్గాల వారు, మిత్రులు, సేవా సమితి సభ్యులు, తదితర గోభక్తుల ద్వారా సేకరించిన సుమారు రూ. 74,000 విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాల, టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల, 3 టౌన్ ప్రాంతంలోని శ్రీ వాసవి దేవాలయం, శ్రీ లక్ష్మీ రంగనాథస్వామి గోశాల, శ్రీ గుంటిమల్లేశ్వరస్వామి గోశాల, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గోశాల, కాలవొడ్డు శ్రీ ఆంజనేయస్వామి గోశాల మరియు శ్రీ శృంగేరి శారదాపీఠం గోశాలలకు పచ్చిగడ్డి, బెల్లం బాక్సులు, మినప, పెసర, కంది, బొబ్బర చున్నీ, వరిపేలాలు, కూరగాయలు తదితర గోదాణాను ఆయా గోశాలల బాధ్యులకు దాతల పక్షాన అందజేశారు.

ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ తూములూరి లక్ష్మీ నరసింహారావు, సభ్యులు సూరినేటి మల్లేశం, పల్లా లింగయ్య, గజ్జి సూర్యనారాయణ, కందిబండ రమేష్, రైల్వే మధ్య గేట్ శ్రీ హనుమాన్ దేవాలయ ఛైర్మన్ ఖాజా మురళీకృష్ణ, దాతలు మిట్టపల్లి ప్రభాకర్ రావు, వంగవీటి నవీన్, చల్లా రమేష్, కటకం ఉదయభాస్కర్, మైలవరపు భద్రయ్య దంపతులు, కారంశెట్టి నాగేశ్వరరావు, దేవిశెట్టి అశోక్ కుమార్ దంపతులు, సుంకర యెల్లారావు, ఇద్దెగాని నాగేశ్వరరావు, వి.వి. సుబ్బారావు తదితరులతో పాటు గోభక్తులు, మహిళా భక్తులు, ఆయా గోశాలల బాధ్యులు ఓం నారాయణ, కేసా హనుమంతరావు, ఆరుట్ల శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.

శ్రీ స్తంభాద్రి సేవాసమితి కన్వీనర్ తూములూరి లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ సోమవతి అమావాస్య చాలా విశిష్టమైన ప్రాధాన్యంతో కూడిన రోజు అని ఈ అమావాస్యకు గోమాతలకు వివిధ రకాల దానాలు సమర్పించటం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని పితృదేవతలు సంతృప్తి చెందుతారని గోమాతలకు ఆహారం అందిస్తే పితృదేవతలకు స్వయంగా ఆహారం అందించిన ఫలితం దక్కుతుందని తెలియజేశారు స్తంభాద్రి సేవ సమితి ద్వారా అనేక విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోవులకు ఆహారం అందించడం నిరంతరం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

ఈ సందర్భంగా గోదాణాకు సహకరించిన పెద్దలకు, దాతలకు, గోభక్తులకు ఆయా గోశాలల వారు వేద ఆశీర్వచనాలు తెలియజేస్తూ, శ్రీస్వామివారి మరియు ముక్కోటి దేవతల నిలయమైన నడిచే ప్రత్యక్ష దైవం శ్రీ గోమాత అనుగ్రహం కలగాలని ఆశీర్వదించి, ధన్యవాదాలు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.