Khammam: మంత్రిప్రగడ శ్రీనివాసరావు రచనలు సమాజానికి అక్షర ఆయుధాలు!

Khammam: ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావుకు టీడబ్ల్యూజేఎఫ్ ఘన సన్మానం. సామాజిక చైతన్యానికి ఆయన రచనలే అక్షర ఆయుధాలని కొనియాడిన నేతలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 19 Sept 2026 10:22 PM IST
Khammam
X

Khammam: మంత్రిప్రగడ శ్రీనివాసరావు రచనలు సమాజానికి అక్షర ఆయుధాలు!

ఖమ్మం, సెప్టెంబర్ 19: సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత మంత్రి ప్రగడ శ్రీనివాసరావు రచనలు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ అన్నారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ, ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్ సభకు అధ్యక్షత వహించారు.

సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ తెలుగు భాషపై మక్కువ, సామాజిక అంశాలపై అవగాహన, నిరంతర కృషి శ్రీనివాసరావు రచనలకు ప్రత్యేకతను తీసుకొచ్చాయని అన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆయన రాసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కథనాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని గుర్తుచేశారు. అమెరికాలోనూ తెలుగు భాష, సంస్కృతి విశిష్టతను చాటిన శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాకు చెందినవారు కావడం గర్వకారణమన్నారు. జర్నలిస్టుల హక్కులు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఆయన అనుభవం, రచనా ప్రతిభ ఫెడరేషన్‌కు ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ శ్రీనివాసరావు రచనలు, కవితలు యువ జర్నలిస్టులకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయని అన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు షేక్ జానీ పాషా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మధుశ్రీ, జిల్లా కమిటీ సభ్యులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దగ్గుబాటి మాధవరావు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు తదితరులు ఆయన సేవలను కొనియాడారు. ఆయన సాహిత్య, జర్నలిస్టు సేవలను గుర్తించి తగిన గౌరవ పురస్కారానికి సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలించాలని సంతోష్ చక్రవర్తి సూచించారు.

సత్కారానికి స్పందించిన మంత్రి ప్రగడ శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికాలో అవార్డు పొందడం కంటే ఆత్మీయ జర్నలిస్టుల మధ్య ఫెడరేషన్, ప్రెస్ క్లబ్ వేదికగా సత్కారం పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సయ్యద్ ఖదీర్ నాయకత్వాన్ని, దువ్వా సాగర్, జానీ పాషా అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కులు, ఇళ్ల స్థలాల సమస్యలతో పాటు జర్నలిస్టు సంక్షేమ అంశాలపై తన రచనా శక్తిని వినియోగిస్తానని తెలిపారు. హక్కుల సాధన కోసం అన్ని జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీనివాసరావును శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు యూసుఫ్ పాషా, జర్నలిస్టులు ఎస్వీ రెడ్డి, రోషి రెడ్డి, మురళి, వీడియో జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు అర్షద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.