Khammam: ఏదులాపురంలో మంత్రి పొంగులేటి రోడ్డు పనులకు శంకుస్థాపన

Khammam: ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీలో రూ. 5.19 కోట్ల రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన; 45 రోజుల్లో రూ. 40 కోట్ల పనులని కలెక్టర్ వెల్లడి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 24 Nov 2026 8:06 PM IST
Khammam
X

Khammam: ఏదులాపురంలో మంత్రి పొంగులేటి రోడ్డు పనులకు శంకుస్థాపన

ఖమ్మం: అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీలోని 25, 26వ వార్డుల్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి పర్యటించి రూ.2 కోట్ల 49 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు–కోట నారాయణపురం రోడ్డు నుంచి ఆబౌండ్షిప్ వరకు రూ.2 కోట్ల 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 35 నెలలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ పేద ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడా అభివృద్ధి కుంటు పడకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.

పేద ప్రజల సంక్షేమం, నిరుద్యోగులకు భరోసా, భద్రత కల్పించడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు నేడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విష ప్రచారానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక కుటుంబం కోసమే పనిచేసిందని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వాస్తవాలను వివరిస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

నాగార్జునసాగర్ నుంచి పల్నాడుకు నీటిని తరలించేందుకు గత పాలకుల హయాం లోనే జీవో జారీ అయినప్పటికీ అప్పటి పాలకులు మౌనంగా ఉన్నారని, నేడు అదే అంశంపై విమర్శలు చేయడం సరి కాదని అన్నారు. కృష్ణా నదిలో తెలంగాణకు 570 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా గత పాలకులు కేవలం 299 టీఎంసీలకే అంగీకరించారని విమర్శించారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచుతున్న సమయంలో మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఏం చేశారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ జీవో విడుదల చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గతంలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పకుండా నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.

గోదావరి జలాల వినియోగంలో గత పాలకుల నిర్లక్ష్యం:

గోదావరి నదిపై గత పాలకులు నిర్మించిన బ్యారేజీల పరిస్థితి కారణంగా నేడు కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మించేలా గత పాలకులు ఒప్పందాలు చేసుకోవడం వల్ల గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను తరలించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారని తెలిపారు.

గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వంతో, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇటీవల ప్రధానమంత్రిని, అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పాత ఒప్పందాల పునఃపరిశీలనకు సానుకూలత సాధించే దిశగా కృషి చేశారని తెలిపారు. గతంలో జరిగిన ఒప్పందాలను పునఃపరిశీలించేలా కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.

కృష్ణా నది పరివాహక ప్రాంత రైతులకు గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని, పదేళ్ల పాలనలో ఎక్కడైనా బ్రాంచ్ కెనాల్స్, పంట కాలువలు తవ్విన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టుల ఫలితాలను తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం సరికాదన్నారు.

గత పాలకులు భూసేకరణ కోసం ఖర్చు చేసిన నిధుల కంటే ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాజెక్టుల భూసేకరణ కోసం అధిక నిధులు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు.

ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతారని అన్నారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రావాల్సిన వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టబోదని స్పష్టం చేశారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గత 45 రోజుల వ్యవధిలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు ఎప్పటి కప్పుడు ప్రారంభించి ప్రజలకు అందుబాటు లోకి తీసుకువస్తున్నామని అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎదురవుతున్న ఎల్-3 నుంచి ఎల్-1 సమస్యలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిఆర్ ఎస్ఇ జి. వెంకట్ రెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపల్ చైర్‌ పర్సన్ పోకబత్తిని అనిత, మునిసిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.