Khammam: నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న బేకరీ భట్టీ సీజ్!

Khammam: ఖమ్మం ముస్తఫా నగర్, పాకబండ బజార్‌లో కాలుష్య నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న సుధా ఎంటర్‌ప్రైజెస్ బేకరీ తయారీ భట్టీని నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు.

Rohith
Published on: 2 Nov 2026 4:35 PM IST
Khammam
X

Khammam: నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న బేకరీ భట్టీ సీజ్!

ఖమ్మం, నవంబర్ 1: ఖమ్మం నగరంలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు ముస్తఫా నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సుధా ఎంటర్‌ప్రైజెస్ బేకరీ తయారీ భట్టీని అధికారులు సీజ్ చేశారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించగా, భట్టీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, బూడిద కారణంగా పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.

గతంలో జారీ చేసిన నోటీసులు, విధించిన జరిమానాలను పట్టించుకోకుండా, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అవసరమైన మున్సిపల్, ఆహార భద్రత అనుమతులు లేకపోవడంతో సంస్థను సీజ్ చేశారు. ఈ చర్యల్లో అసిస్టెంట్ కమిషనర్ గారి సారధ్యంలో ఇన్‌ఛార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. మల్లయ్య, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్, శానిటరీ జవాన్లు, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ లోకేష్ మరియు సంబంధిత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నగర పరిధిలో ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజారోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు మున్సిపల్ నిబంధనలు, కాలుష్య నియంత్రణ ప్రమాణాలు మరియు ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఖమ్మం నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేసింది.

Rohith

Rohith