Khammam: కొత్త పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి తుమ్మల

Khammam: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో కొత్త చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్‌తో కలిసి పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2026 7:58 PM IST
Khammam
X

Khammam: కొత్త పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . శనివారం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో నిర్వహించిన చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి , జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ తో కలిసి పాల్గొని, లబ్ధిదారులకు చేయూత పింఛను మంజూరు పత్రాలను, స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రజావాణిలో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు పింఛన్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో కొడుకులు, కోడళ్లపై ఆధారపడకుండా మందులు, భోజన ఖర్చుల కోసం ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

చేయూత పింఛనుల పథకం లో భాగంగా రఘునాథపాలెం మండలంలో 844 మందికి, జిల్లా వ్యాప్తంగా 33,000 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, వచ్చే నెల 1వ తేదీ నుండి వీరికి పింఛన్ అందుతుందని మంత్రి తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే భవిష్యత్తులో పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు. పింఛన్లతో పాటు తెల్ల రేషన్ కార్డులు లేని అర్హులందరికీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అన్నారు. లబ్ధిదారులు ఎటువంటి కంగారు పడకుండా, ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్దకు వెళ్లి తమ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీతో పాటు పేదల సంపాదన ఆసుపత్రులు, చదువుల పాలు కాకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటోందన్నారు. మండలంలోని ప్రతి బిడ్డ చదువుకునేలా ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్, త్వరలో రాబోయే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, బెల్టులు అందించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

గతంలో వర్షాధారంపైనే ఆధారపడి, వేసవి వస్తే కనీసం తాగడానికి, పశువులకు, ఇంటి ముందు కళ్లాపి చల్లడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడిన రఘునాథపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని చెరువులన్నింటినీ ముందుగానే నింపి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంగిడి చెరువుకు కాలువను తీయించే పనులను త్వరలోనే మంజూరు చేసి ఆ ప్రాంతానికి నీరందిస్తామన్నారు. బుగ్గవాగు పథకం ద్వారా పైప్‌లైన్ వేసి మిగిలిన అన్ని చెరువులకు వేసవిలోనూ నీరు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, తద్వారా బోర్లు పుష్కలంగా నీరందుతుందని తెలిపారు. తిరుమలాయపాలెం మండలం తరహాలోనే రఘునాథపాలెం కూడా పచ్చబడాలని మంత్రి ఆకాంక్షించారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినోప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువు ఛాయలు, అకాల వర్షాలు, తుఫాన్ల ముప్పు పొంచి ఉందని మంత్రి అన్నారు. ఇటీవలి తుఫాను వల్ల వరి పంటలు నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారని, అదే సమయంలో ఆయిల్ పామ్ తోటలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అన్నారు. రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా, ఉన్న నీటి వనరులకు అనుగుణంగా తక్కువ నీటితో, తేమకు పండే శనగలు, కందులు, పెసలు, మినుములు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు.

కూరగాయలు, మిర్చి పంటల్లో అంతర పంటగా ఆయిల్ పామ్ మొక్కలు నాటుకోవాలని, 2.5 సంవత్సరాల తర్వాత పంట చేతికి వచ్చి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేసే గిరిజన, దళిత, బీసీ అన్ని వర్గాల రైతులకు ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ, ప్రజావాణిలో, ప్రతిరోజూ పెన్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు. వచ్చిన సుమారు 36 వేల దరఖాస్తులలో, వితంతువులు, దివ్యాంగులు సహా దాదాపు 33 వేల మంది అర్హులను గుర్తించి, ఎటువంటి టార్గెట్లతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధిక పెన్షన్ అందుతోందని అన్నారు. దివ్యాంగులకు రూ. 4,016, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 2,016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి ఇంకా పెన్షన్ మంజూరు కాని వారి కోసం కార్యక్రమ ప్రాంగణంలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఈ కౌంటర్‌లో సమర్పించాలని, వాటిని త్వరితగతిన పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, డిఆర్డివో కె. శ్రీరామ్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, మండల ప్రత్యేక అధికారి డా. పురందర్, రఘునాథపాలెం మండల ఎంపిడివో అశోక్ కుమార్, మంచుకొండ గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్