Sathupalli: వరద సహాయక చర్యలపై ఉమ్మడి ఖమ్మం అధికారులతో మంత్రి సమీక్ష
Sathupalli: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యలు, పంట నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎస్డీఆర్ఎఫ్ సేవలు భేష్.
Sathupalli: వరద సహాయక చర్యలపై ఉమ్మడి ఖమ్మం అధికారులతో మంత్రి సమీక్ష
సత్తుపల్లి: వరద విపత్తుపై అధికారులు సమన్వయంతో తీసుకున్న చర్యలు, ప్రాణనష్టం లేకుండా చేపట్టిన చర్యలను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. గురువారం సింగరేణి కాలరీస్ గెస్ట్ హౌజ్ లో బేతుపల్లి వరద సహాయక చర్యలు, వరద ముంపు నష్టాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వరావుపేట ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి హెడ్‌క్వార్టర్స్ పరిధిలో సంభవించిన వరదలు, వాటి నష్టాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు.
రాత్రి సమయంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించడానికి వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి రక్షించారన్నారు. బోట్లు బోల్తా పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, రాత్రి నుంచి ఉదయం వరకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా అందరినీ సురక్షితంగా కాపాడటం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రాత్రి రెండు పర్యాయాలు ప్రత్యేకంగా మాట్లాడి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించారన్నారు. కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవేక్షించడం వలన పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.
2023 డిసెంబర్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2024 ఆగస్టు చివరిలో మున్నేరు వాగు ఊహించని రీతిలో సుమారు 76-77 అడుగుల ఎత్తుతో ప్రవహించినప్పుడు భారీ నష్టం వాటిల్లిందని, అప్పట్లో ఎస్డీఆర్ఎఫ్ దగ్గర తగిన పరికరాలు లేకపోవడాన్ని గమనించిన ముఖ్యమంత్రి, మంత్రులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విపత్తు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
పోలీసు శాఖ నుంచి 1200 మందిని, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 700 మందిని ఎంపిక చేసి ఎస్డీఆర్ఎఫ్ను పటిష్టం చేయడంతో పాటు, మొత్తం 1,900 మంది సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. సుమారు రూ. 260-270 కోట్ల వ్యయంతో అత్యుత్తమ అత్యాధునిక పరికరాలను ఎస్డీఆర్ఎఫ్ కు ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఏ మూలన విపత్తు వచ్చినా 45 నుండి 50 నిమిషాల లోపు సహాయక చర్యలు అందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రాణనష్టం జరగకుండా అహర్నిశలు శ్రమించిన అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రజాప్రతినిధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించిందని, ఎక్కడా ఎటువంటి ప్రాణహాని జరగకుండా పూర్తి స్థాయిలో ప్రాణాలను, ఆస్తులను కాపాడగలిగామని మంత్రి అన్నారు. విపత్తు సంభవించిన వెంటనే కేవలం 30 నుంచి 35 నిమిషాల వ్యవధిలోనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని తెలిపారు.
నీళ్లలో ఇరుక్కుపోయిన వారిని సెల్లైట్ల ఆధారంగా గుర్తించి, టెక్నాలజీని, మ్యాన్‌పవర్‌ను సద్వినియోగం చేస్తూ సింగిల్ ప్రాణహాని కూడా జరగకుండా రక్షించడం జరిగిందన్నారు. రాత్రింబవళ్ళు నిద్రలేకుండా కష్టపడి పనిచేసిన ప్రతి అధికారిని, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖా మంత్రిగా అభినందించారు.
అశ్వారావుపేట నియోజకవర్గం, సత్తుపల్లి తదితర ప్రాంతాలలో విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్అండ్బి, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. కొన్ని ప్రాంతాలలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తెగడం, చెరువులు పొంగిపొర్లడం వల్ల కింద ఉన్న వరి ఇతర పంటలు దెబ్బతిన్నాయనారు. మల్లెపూవు వాగు ప్రవహించడం వల్ల డౌన్‌స్ట్రీమ్‌లో ఉన్న పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.
రోడ్లపైకి చెత్తాచెదారం, వరద నీరు చేరడం వల్ల కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బి, పంచాయతీ రాజ్ రోడ్లకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. విపత్తు ప్రాతిపదికన రానున్న 2-3 రోజుల్లోగా నష్టానికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్డ్ ఎస్టిమేట్స్‌ను ప్రభుత్వానికి సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందన్నారు.
కేవలం అధికారుల అంచనాలే కాకుండా, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులు స్వయంగా ఫీల్డ్ విజిట్లు నిర్వహించి, నిజంగా నష్టపోయిన రైతులను గుర్తించి ఆ వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. .
గత 36 గంటలుగా నిరంతరం శ్రమించి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విపత్తు నిర్వహణలో కష్టపడిన ఎస్డీఆర్ఎఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సిబ్బందిలో ఎవరికైనా ఇళ్లు లేని పక్షంలో, వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని, అర్హులైన వారి జాబితాను పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇరిగేషన్, ఆర్అండ్బి, పంచాయతీ రాజ్, వ్యవసాయ, విద్యుత్, తాగునీరు శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల వారీగా జరిగిన వాస్తవ నష్టాలపై తక్షణ నివేదికను రానున్న 2-3 రోజుల్లో అందజేయాలని మంత్రి ఆదేశించారు.
సమీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరద పరిస్థితులలో సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల అప్రమత్తతతో పూర్తిగా రక్షించడం జరిగిందన్నారు. చెరువు నీటి మట్టం, ప్రవాహ ఉధృతీ సమయంలో సాయంత్రం సుమారు 5:00 గంటల సమయంలో 8 మంది మత్స్యకారులు తెప్ప బోటును వేసుకుని చెరువులోకి వెళ్లడం జరిగిందని, వరద ఉధృతి పెరగడంతో వారు అక్కడే ఇరుక్కుపోవడం జరిగిందని తెలిపారు.
అధికారులు స్పందించి, తక్షణ సహాయక చర్యల కోసం అందరినీ సమాయత్తం చేశామన్నారు. అప్పటికే భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇక్కడికి తక్షణమే రప్పించగా, వారు కేవలం 25 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. మొదటి బోటు ద్వారా వెళ్లి, ఈత రాని ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారున్నారు.
ఆ తర్వాత రెండవ బోటు సహాయంతో మిగతా వారిని రక్షించడానికి వెళ్లిన సమయంలో, వరద ప్రవాహం మరింత పెరగడంతో రెండు బోట్లు బ్యాలెన్స్ కోల్పోయి ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా నీటిలో పడిపోవడం జరిగిందని తెలిపారు. తక్షణమే అప్రమత్తమైన యంత్రాంగం విజయవాడ నుండి కెప్టెన్ కిరణ్, నీరజ్ ల నేతృత్వంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించామని తెలిపారు.
పోలీసు శాఖ, ఇతర యంత్రాంగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ లొకేషన్ ట్రేసింగ్ ఉపయోగించి రాత్రి సమయంలో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసోపేతంగా వ్యవహరించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసు యంత్రాంగం చొరవతో మొత్తం 8 మంది మత్స్యకారులను, రెస్క్యూ సిబ్బందిని ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పూర్తిగా రక్షించగలిగామన్నారు. ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న విపత్తు యంత్రాంగానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.
సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాకు రెడ్ అలర్ట్ నేపథ్యంలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ , అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమై, సహాయక చర్యలను వేగవంతం చేసిందని తెలిపారు. గతంలో భద్రాచలం డివిజన్ చెర్ల, దుమ్ముగూడెం, గోదావరి పరివాహక ప్రాంతాల పరిధిలో వరద ముప్పు ఎక్కువగా ఉండేదని, అయితే ఈసారి కొత్తగూడెం డివిజన్లో ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ వర్షపాతం నమోదైందని అన్నారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన వెంటనే రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పోలీసు శాఖలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇతర విభాగాల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరినీ అలర్ట్ చేసి హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.
ముల్కలపల్లి సమీపంలో ఐటీడీఏ వైపు వెళ్తుండగా వరదలో చిక్కుకుని, చెట్టుపై తలదాచుకున్న 40 సంవత్సరాల మహిళను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయన్నారు. ముల్కలపల్లిలోనే వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగిన వేళ, ఒక 20 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో చెట్టుపైకి ఎక్కగా, అతనికి లైఫ్ జాకెట్లు, రోప్‌లు, డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారన్నారు. దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన 11 మంది గిరిజనులు వరద నీటిలో చిక్కుకోగా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని వారందరినీ క్షేమంగా బయటకు తరలించాయన్నారు. తదనంతరం అదే బృందం సత్తుపల్లిలోని అత్యవసర ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొందన్నారు.
భారీ వర్షాల కారణంగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని, అలాగే పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో పూర్తిస్థాయి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, రాబోయే రెండు రోజుల్లో కచ్చితమైన నష్ట పరిహార నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు.
సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ మాట్లాడుతూ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా విజయవంతంగా సహాయక చర్యలు పూర్తి చేశాయన్నారు. వరద ముప్పును ముందే అంచనా వేసి, ములకలపల్లి పోలీస్ స్టేషన్, దమ్మపేట, అశ్వారావుపేటలలో ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను ముందుగానే స్టాండ్‌బై ఉంచడం జరిగిందన్నారు.
సత్తుపల్లి ప్రాంతంలో వరద ఉధృతి పెరిగిన వెంటనే, కలెక్టర్ ఆదేశాల మేరకు దమ్మపేట, కొత్తగూడెం వైపు ఉన్న ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను ఆ ప్రాంతానికి రప్పించడం జరిగిందని, తొలి విడతలో ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా రెస్క్యూ చేసామన్నారు. అనంతరం నీటి మట్టం మరింత పెరగడంతో, 6వ బెటాలియన్ ఎస్.డి.ఆర్.ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని, రాత్రంతా శ్రమించి మరో ఐదుగురిని రక్షించడం జరిగిందన్నారు.
ఉదయం 5:30 గంటల నుండి రెండవ విడత ఆపరేషన్ ప్రారంభించి, డ్రోన్లు, ఆధునిక పరికరాలు, మోటార్ బోట్లను ఉపయోగించి చెట్లపై చిక్కుకున్న వారి లొకేషన్లను మ్యాప్ చేసి ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాల సహాయంతో నిర్దిష్ట ప్రణాళికతో అందరినీ సురక్షితంగా కాపాడడం జరిగిందన్నారు.
ఈ సమయంలో రెవెన్యూ, పోలీస్, ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో రేయింబవళ్లు శ్రమించడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రశాంతంగా రెస్క్యూ ఆపరేషన్లు ముగిసాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఖమ్మం జిల్లా యంత్రాంగం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల ప్రజల ప్రాణాలు పూర్తిగా కాపాడబడ్డాయన్నారు.
సమీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, అకస్మాత్తుగా ఎదురైన విపత్తును సమన్వయంతో, సాహసంతో ఎదుర్కొని అందరినీ రక్షించారాని, అధికారులు, సహాయక బృందాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా యంత్రాంగం, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేశారన్నారు.
సమీక్షలో పాల్గొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టం లేకుండా చూశారన్నారు. వరదతో జరిగిన పంట నష్టాన్ని అందించాలన్నారు. విపత్తులో పాల్గొన్న వారిని అభినందించారు.
ఈ సమీక్షా సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




