Khammam: ఖమ్మం వైద్య కళాశాలలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై వదంతులు నమ్మవద్దు
Khammam: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయంటూ వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవమని ప్రిన్సిపాల్ తాటి శంకర్ స్పష్టం చేశారు.
Khammam: ఖమ్మం వైద్య కళాశాలలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై వదంతులు నమ్మవద్దు
ఖమ్మం: కళాశాలలో వివిధ అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి బయట, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తాటి శంకర్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ పోస్టులు డబ్బులకు అమ్ముడుపోతున్నాయంటూ జరుగుతున్న అసత్య ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రిన్సిపాల్ తీవ్రంగా ఖండించారు.
నోటిఫికేషన్ ద్వారా అందిన దరఖాస్తులు ప్రస్తుతం ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఎవరికీ ఉద్యోగాలు కేటాయించలేదని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఎంపికైన వారి జాబితా మొదలైనవి ఎప్పటికప్పుడు కళాశాల అధికారిక వెబ్‌సైట్ (gmckhammam.org), ఖమ్మం జిల్లా అధికారిక వెబ్‌సైట్ (khammam.telangana.gov.in) లలో అప్‌డేట్ చేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ అన్నారు.
మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ ఎవరైనా మధ్యవర్తులు లేదా వ్యక్తులు మాయమాటలు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే అభ్యర్థులు ఎవరూ నమ్మవద్దని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. అభ్యర్థులు ఎవరైనా వ్యక్తిగతంగా ఇతరులకు డబ్బులు ఇచ్చి నష్టపోతే, అందుకు ప్రభుత్వ వైద్య కళాశాల, ఖమ్మం యాజమాన్యానికి ఎటువంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.
నిరుద్యోగ అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రిన్సిపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




