Khammam: ఖమ్మంలో బియ్యం దుకాణాలపై తనిఖీలు 53 బస్తాలు సీజ్

Khammam: ఖమ్మం పట్టణంలోని రైస్ స్టోర్లలో పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు. తూకంలో తేడాల వల్ల 53 బియ్యం బస్తాలు సీజ్, వ్యాపారులకు జరిమానా.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Nov 2026 9:35 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో బియ్యం దుకాణాలపై తనిఖీలు 53 బస్తాలు సీజ్

ఖమ్మం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పౌర సరఫరాల అధికారి, లీగల్ మెట్రాలజీ అధికారి సంయుక్తంగా ఖమ్మం పట్టణంలోని పలు కిరాణా, రైస్ స్టోర్లలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ అన్నారు.

ఈ తనిఖీల సమయంలో బియ్యం బస్తాలపై ముద్రించిన బరువు కంటే తక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అమలులో ఉన్న లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం సంబంధిత వ్యాపారులపై జరిమానా విధించడమే కాకుండా, తక్కువ బరువు ఉన్న బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.

ఈ తనిఖీల్లో భాగంగా మామిళ్లగూడెంలోని లక్ష్మీ వేంకటేశ్వర కిరాణా & జనరల్ మర్చంట్ లో రూ. 18 వేల విలువుగల 12 బస్తాలు, శ్రీ లక్ష్మీ బాలాజీ కిరాణా & జనరల్ స్టోర్ లో రూ. 28,500 విలువుగల 15 బస్తాలు సీజ్ చేశారన్నారు. అలాగే కస్బా బజార్‌లోని షేక్ జానీమియా రైస్ స్టోర్స్ లో రూ. 7,500 విలువుగల 5 బస్తాలు, సుపీరియర్ ఎంటర్ ప్రైజెస్ లో రూ. 42 వేల విలువుగల 21 బియ్యం బస్తాలను అధికారులు సీజ్ చేశారన్నారు. మొత్తంగా నాలుగు దుకాణాల్లో కలిపి రూ. 96 వేల విలువైన 53 బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు పౌర సరఫరాల అధికారి తెలిపారు.

ఈ సందర్భంగా పౌరసరఫరాల అధికారి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. బియ్యం బస్తాలపై ముద్రించిన తూకం ప్రకారమే విక్రయాలు జరపాలని, తూకంలో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. వినియోగదారులకు సరైన పరిమాణంలో సరుకులు అందేలా చూడటానికి జిల్లాలోని వ్యాపారులందరూ అధికారుల తనిఖీలకు సహకరించాలని కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.