Khammam: ఖమ్మం ఖిల్లా రోప్‌వే పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల!

Khammam: ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్మాణ సంస్థ సీఈఓ రంజిత్ పరకాసిని ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 4 Nov 2026 9:21 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం ఖిల్లా రోప్‌వే పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల!

ఖమ్మం: ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణ పనులను నిర్ణీత కాలపరిమితి లోగా పూర్తి చేసి, ప్రజలకు త్వరితగతిన రోప్‌వే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణ పనుల పురోగతిపై రోప్‌వే నిర్మాణ సంస్థ సీఈఓ రంజిత్ పరకాసి హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను, పర్యాటక ఆకర్షణను దృష్టిలో ఉంచుకుని రోప్‌వే ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిర్దేశించిన గడువుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

రోప్‌వే ప్రారంభమైన అనంతరం పర్యాటకులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. రోప్‌వేకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, ఇతర మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా సందర్శకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రోప్‌వే నిర్వహణకు అవసరమైన భద్రతా ప్రమాణాలు, సాంకేతిక తనిఖీలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.

ఖమ్మం ఖిల్లా రోప్‌వే అందుబాటులోకి వస్తే ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం ఖిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగేలా, సందర్శకులకు మెరుగైన అనుభూతి కలిగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసి రోప్‌వే సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.