Khammam: సామినేని రామారావు హత్య కేసు సీపీని సస్పెండ్ చేయాలని సీపీఎం డిమాండ్
Khammam: సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో ఖమ్మం సీపీ సునీల్ దత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీపీఎం విరుచుకుపడింది.
Khammam: సామినేని రామారావు హత్య కేసు సీపీని సస్పెండ్ చేయాలని సీపీఎం డిమాండ్
ఖమ్మం: ఖమ్మం సీపీ డైరెక్షన్ లో సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేలా సాగుతోందని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డైరెక్షన్ లోనే ఈ డ్రామా స్క్రిప్ట్ నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఖమ్మంలోని సుందరయ్య భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామారావు హత్యలో అసలు హంతకులను, రౌడీలను, గూండాలాను కాపాడేందుకు పోలీస్ కమిషనర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే రామారావు రిమాండ్ రిపోర్ట్ లో 14 మంది సాక్షులను విచారించామని చెప్పినప్పటికీ, అందులో ఇద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వాళ్ళంతా వేరే పేర్లు చెబుతున్నారని స్పష్టం చేశారు.
భట్టి విక్రమార్క చెబితే సీపీ సునీల్ దత్ ఈ కట్టు కధ అల్లుతున్నారని విమర్శించారు. హత్య వెనుక అసలు మోటివ్ ను పక్కన పెట్టి, సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తూ తప్పుడు కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. రామారావు హత్యకు కారణమైన హంతకులను శిక్షించే వరకు అసలు దోషులు పట్టబడే వరకు సీపీఎం పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని, రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.సీపీ ఖమ్మం జిల్లా ప్రజల ముందు పెద్ద నాటకం చూపించారని అన్నారు. భట్టి మధిర నియోజకవర్గం లో హత్యాకాండ ద్వారా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు సీపీఎం కు చెందిన ముగ్గుర్ని హత్య చేశారని చెప్పారు. భట్టి అన్యాయాలు,అవినీతిని, అక్రమాలు ప్రశ్నించినందుకే సామినేని రామారావు ను హత్య చేశారని ఆరోపించారు.
హత్యకు నెల రోజుల ముందు రామారావు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారని పేర్కొంటూ అ సందర్బంగా రామారావు ప్రసంగం ఆడియో ను విలేకరులకు వినిపించారు. భట్టికి సీపీ మొదట నుంచి ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తరు.ప్రజాభవన్ లో భట్టి సమక్షంలో తయారు చేసిన స్క్రిప్ట్ ను సీపీ అమలు చేస్తున్నారని, కానీ నాటకం అట్టర్ ప్లాప్ కాక తప్పదని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి భట్టి డైరెక్షన్ లో జ్ఞానేష్ కుమార్ లాంటి సీపీ అన్యాయానికి తెర లేపారని విమర్శించారు.
ఫారెన్సిక్ టెస్ట్ కు రాలేదని నేరస్తులు అనడం సరికాదన్నారు.సీపీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. హంతకులను పట్టుకునే దాకా సీపీఎం ఎవర్ని వదిలి పెట్టదని, పెద్ద ఎత్తున పోరాడుతుందని, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. పొలిటికల్ మర్డర్ అంటున్న సీపీ 10 జన్మ లెత్తినా ఈ కేసును తేల్చలేరని అన్నారు. భట్టి ప్రోత్సాహం తోనే రామారావు ను హాత్య చేశారన్నది వాస్తవమని అన్నారు. ఆర్థిక వ్యవహారాలు కూడా కారణమంటున్నారని, ఛాలెంజ్ చేస్తున్నామని,అధికారంలో వారే ఉన్నారని,అవేమిటో తెల్చాలని డిమాండ్ చేశారు.
సీపీని తక్షణమే సస్పెండ్ చేయాలి : నున్నా నాగేశ్వరరావు
సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ
ఖమ్మం జిల్లాలో ఐపీఎస్ వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న పోలీస్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామారావు హత్య కేసులో ఏడాది గడిచినా హంతకులను అరెస్ట్ చేయకుండా, పోలీసు శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీపీ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. సీఎంను కలిసి సిట్ ప్రత్యేక దర్యాప్తు కోరినా ఫలితం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా భట్టి అడ్డుకున్నారని ఆరోపించారు.
సీపీ చెబుతున్న అబద్ధపు కథలను రామారావు కుటుంబ సభ్యులు, ప్రజలు, చివరికి పోలీసు అధికారులే నమ్మలేక నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. అధికార పక్షం ఒత్తిళ్లకు పూర్తిగా తలవొగ్గి, ఆత్మగౌరవాన్ని కూడా వదిలిపెట్టి బ్రష్టుపట్టిన రీతిలో వ్యవహరిస్తున్న సీపీ ఖమ్మంలో ఉండటం జిల్లాకే అవమానకరమని అన్నారు. హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ సీపీని వెంటనే సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులను చట్టం ముందు నిలబెట్టే వరకు సీపీఎం ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. సీపీ ఉద్దేశ పూర్వకంగా నేరస్తులను పట్టుకోకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు.రామారావు భార్య గుర్తు పట్టి కొందరి పేర్లు చెప్పినా వారిని విచారించలేదన్నారు.
సంవత్సరమైనా హంతకులను పట్టుకోలేక, వర్ధంతి వస్తుండడం తో హడావిడిగా ఎవర్నో పట్టుకొచ్చి సరికొత్త నాటకానికి తెరతీసారని, ప్రజలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. హంతకులు ఆ ఊర్లోనే ఉన్నా పట్టుకోవడం లేదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ఆసలు హంతకులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం ను, డీజీపీ ని కలిసి, సిట్ విచారణ కోరతామన్నారు.
సీపీ ని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా కోరతామన్నారు. న్యాయపోరాటం చేసి, ఆసలు హంతకులను, వారిని రక్షించే అధికారులను కూడా బోను లో నిలబెడతామన్నారు.విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బండి పద్మ, కళ్యాణం వేంకటేశ్వరరావు, మాదినేని రమేష్, విక్రమ్, పార్టీ సీనియర్ నాయకులు చింతలచెర్వు కోటేశ్వరరావు,మధిర డివిజన్ కార్యదర్శి ఎం. గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.




