Wyra: వైరా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

Wyra: ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్. రికార్డులను పరిశీలించి, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం.

SHAIK RAFI, WYRA
Published on: 12 Nov 2026 3:56 PM IST
Wyra
X

Wyra: వైరా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

వైరా: విధుల నిర్వహణలో అప్రమత్తత, కేసుల దర్యాప్తులో వేగం, ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం వైరా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులోని కేసులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి, నేరాల దర్యాప్తులో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.

ప్రతి కేసు పురోగతిని అధికారులు నిరంతరం సమీక్షిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

సీసీటీఎన్‌ఎస్‌ లో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ, నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.

రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ కమిషనర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

SHAIK RAFI, WYRA

SHAIK RAFI, WYRA