Khammam: రీసర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలి
Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్ళపెంటలో భూ రీసర్వే పనుల పరిశీలన; సర్వే తేదీ, సమయం రైతులకు ముందుగానే చెప్పాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ఆదేశం.
Khammam: రీసర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలి
ఖమ్మం: జిల్లాలో చేపడుతున్న రీసర్వే పనులను ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం పెనుబల్లి మండలం తాళ్ళపెంట గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు. రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రీసర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో సంబంధిత భూముల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, రికార్డుల ప్రకారం సర్వే పనులు చేపట్టాలని తెలిపారు.
రీసర్వే నిర్వహించే తేదీ, సమయం గురించి సంబంధిత రైతులకు ముందుగానే సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని, తద్వారా భూముల హద్దులు, ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
రైతులకు ముందస్తు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని, సర్వే ప్రక్రియలో రైతుల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని సూచించారు. రీసర్వేకు సంబంధించిన పనులను సమన్వయంతో నిర్వహిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
అధికారులు అందించే సమాచారాన్ని రైతులు నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచాలని, ఏలాంటి అభ్యంతరాలకు అయిన గడువు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను డేటా ఎంట్రీ నమోదు చేయాలని పేర్కొన్నారు.
రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సర్వే బృందం, రైతులు, తదితరులు వున్నారు.




