Khammam: హాస్టల్ వెల్ఫేర్ అధికారులు హాస్టళ్లలోనే ఉండాలి: కలెక్టర్ దివాకర టిఎస్!

Khammam: హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పనిసరిగా హాస్టళ్లలోనే ఉండాలి ఖమ్మం కలెక్టర్ దివాకర టిఎస్ హెచ్చరిక రాత్రి తనిఖీల్లో లేకుంటే సస్పెన్షన్, నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Sept 2026 9:38 PM IST
Khammam
X

Khammam: హాస్టల్ వెల్ఫేర్ అధికారులు హాస్టళ్లలోనే ఉండాలి: కలెక్టర్ దివాకర టిఎస్!

ఖమ్మం, సెప్టెంబర్ -28: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పనిసరిగా సంబంధిత హాస్టళ్లలోనే అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని,విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌లతో కలిసి పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణపై జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ రెసిడెన్షియల్ విద్యాసంస్థల వద్ద హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అందుబాటులో లేకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకపై జిల్లాలో ఏ రాత్రి అయినా ఏ హాస్టల్‌నైనా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, తనిఖీ సమయంలో సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారి అక్కడ అందుబాటులో లేకుంటే వెంటనే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ వెల్ఫేర్ అధికారి తప్పనిసరిగా సంబంధిత హాస్టల్‌ లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వారానికి రెండు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు:

సూపర్వైజింగ్ అధికారులు వారానికి కనీసం రెండు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లకే పరిమితం కాకుండా జిల్లా అంతర్గత ప్రాంతాల్లోని హాస్టళ్ల నుంచి తనిఖీలు ప్రారంభించాలని సూచించారు.

ఇకపై తాను కూడా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. హాస్టళ్లలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని దాచాల్సిన అవసరం లేదని, తన దృష్టికి తీసుకువచ్చే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నాణ్యమైన ఆహారమే అందించాలి:

ప్రతి హాస్టల్ పరిధిలో వంట సిబ్బంది నిబంధనలను సక్రమంగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, శుచికరమైన, రుచికరమైన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

హాస్టళ్లకు సరఫరా అయ్యే ఆహార పదార్థాల నాణ్యతను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని, నాణ్యత సరిగా లేకుంటే వాటిని వెంటనే తిరిగి పంపించాలని స్పష్టం చేశారు.

అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వంట సిబ్బంది, ఇతర సిబ్బందిలో ఎవరైనా విధులను సక్రమంగా నిర్వహించకపోతే వారిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

కీలక సమస్యలకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ తప్పనిసరి:

తనిఖీల సమయంలో కీలకమైన సమస్యలను గుర్తించిన అనంతరం వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకన్ రిపోర్ట్ తప్పనిసరిగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలను గుర్తించడంతోనే సరిపెట్టకుండా, వాటి పరిష్కారం పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని సూచించారు. హాస్టల్‌లో వంట సిబ్బంది, ఇతర సిబ్బందికి సెలవులు ఇచ్చే విషయంలో సమన్వయంతో వ్యవహరించాలని, అవసరమైన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకుండా చేసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అవసరమైన సౌకర్యాలకు వెంటనే ప్రతిపాదనలు:

విద్యార్థుల సౌకర్యార్థం హాస్టళ్లలో ఏవైనా వస్తువులు లేదా ఇతర సదుపాయాలు అవసరమైతే వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ పరిధిలో అందుబాటులో ఉన్న నిధుల నుంచి అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

మన పిల్లల మాదిరిగానే గురుకులాల నిర్వహణ:

విద్యార్థుల సంక్షేమం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మన పిల్లలు ఉంటే ఎలా ఉండాలని మనం కోరుకుంటామో, అదేవిధంగా గురుకులాలను కూడా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ప్రతి హాస్టల్‌లో విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

ప్రతి నెల రెండు రోజులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు:

ప్రతి నెల రెండవ, నాలుగవ బుధవారం సంబంధిత గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య బృందం సంబంధిత గురుకుల విద్యాసంస్థకు వచ్చి ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, మైనారిటీ సంక్షేమ అధికారి ముహమ్మద్ ముజాహిద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఫిరంగి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.