Khammam: ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచాలి
Khammam: ఖమ్మంలో జాతీయ ఆరోగ్య మిషన్ ప్రగతిపై కలెక్టర్ దివాకర టి ఎస్ సమీక్షించి ప్రసూతి సేవలు, టీకాలు, వ్యాధుల నియంత్రణపై ఆదేశాలు జారీ చేశారు.
Khammam: ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచాలి
ఖమ్మం: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సేవలను మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) కింద 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి నవంబర్ 26 వరకు సాధించిన ప్రగతిపై ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాతా, శిశు సంరక్షణ, ప్రభుత్వ ప్రసవాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. మొదటి త్రైమాసికంలోనే గర్భిణుల నమోదు పూర్తి చేసి, 30 వారాల తర్వాత ప్రతి గర్భిణిని నిరంతరం పర్యవేక్షిస్తూ నాలుగో ఏఎన్సీ పరీక్షను ఏఎన్ఎంలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు గర్భిణుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే అనవసరపు సిజేరియన్లను నివారించి, సాధారణ ప్రసవాల ప్రయోజనాలపై నమోదు సమయం నుండే అవగాహన కల్పించాలని సూచించారు.
ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద జీజీహెచ్‌కు రిఫర్ చేసిన కేసులన్నింటినీ వైద్య అధికారులు పర్యవేక్షించి, సోమవారం (నవంబర్ 30) నాటికి పోర్టల్‌లో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాలని అన్నారు. జిల్లాలో నమోదైన 6 మాతృ మరణాల్లో డీఎంహెచ్ఓ స్థాయిలో 4, కలెక్టర్ స్థాయిలో 2 సమీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన కేసుల సమీక్షను డిసెంబర్ 10 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ, వ్యాధి నిరోధక టీకాల అమలు
ఎస్ఎన్సీయూ లో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు కోలుకున్న వెంటనే తల్లిదండ్రులు డిశ్చార్జ్ కోరుకుంటున్నారని, తద్వారా లామా కేసులు పెరుగుతున్నాయని అధికారులు వివరించగా, తల్లిదండ్రులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చి పూర్తి స్థాయి చికిత్స అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. తక్కువ బరువుతో జన్మించిన, నెలలు నిండని, పుట్టుకతో లోపాలున్న 0-5 ఏళ్ల పిల్లలను ఆర్బీఎస్కే బృందాలు, అంగన్వాడీ టీచర్లు, పీహెచ్‌సీల ద్వారా గుర్తించి న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ లలో చేర్పించాలన్నారు.
పెంటా-3 సహా అన్ని వ్యాధి నిరోధక టీకాల వివరాలను ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు యు-విన్ యాప్‌లో నమోదు చేసేలా వైద్య అధికారులు పర్యవేక్షించాలన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్లో 99.5 శాతం లక్ష్యం పూర్తయిందని, మిగిలిన 70 మంది బాలికలకు కూడా టీకా వేసి 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
గత ఏడాది 268 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 166 కేసులు మాత్రమే నమోదయ్యాయని, గత నెలలో 48 కేసులు ఉండగా ఈ నెలలో 14 కేసులకు తగ్గాయని మలేరియా అధికారి వివరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం, ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి ప్రతి జ్వర బాధితుడికి రక్త నమూనాలు సేకరించడం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 50 శాతం కంటే తక్కువ ఎక్స్-రేలు తీసిన పీహెచ్సీలలో వెంటనే ఎక్స్-రేలు పూర్తి చేసి నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. క్షయ రోగులకు పౌష్టికాహార బుట్టలు అందించేందుకు నిక్షయ్ మిత్రాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలను గుర్తించాలని సూచించారు. కుష్టు వ్యాధిలో గ్రేడ్-2 వైకల్యం సున్నా శాతంగా కొనసాగడం అభినందనీయమని, పిల్లల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు గుర్తింపు, కాంటాక్ట్ పరీక్షలు ముమ్మరం చేయాలన్నారు.
మీ ప్రమాణం హాజరు శాతంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం, అంధత్వ నివారణ కార్యక్రమంలో 75 శాతం ప్రగతితో రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం, హెచ్ఎంఐఎస్ రిపోర్టింగ్, ఆరోగ్య శిబిరాల నిర్వహణలో 100 శాతం లక్ష్యం చేరుకున్నామన్నారు. పాలియేటివ్ కేర్, ఎన్ఆర్సీ, ఆర్బీఎస్కే బృందాలు, టీ-డయాగ్నస్టిక్స్ హబ్‌లలో ఉన్న వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని లేదా తాత్కాలిక డిప్యూటేషన్ ద్వారా సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. టీ-డయాగ్నస్టిక్స్ హబ్‌కు నమూనాలు సకాలంలో చేరేలా అదనంగా రెండు వాహనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 102 అమ్మఒడి వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పీహెచ్సీలలో ప్రతిరోజూ ఏఎన్సీ పరీక్షలు నిర్వహించాలని, టెలీ-మానస్ సేవలపై పాఠశాలలు, కళాశాలల్లో మానసిక వైద్య నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. రామారావు, వివిధ విభాగాల ప్రోగ్రాం అధికారులు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎల్. వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ అరుణ, డాక్టర్ బిందుశ్రీ, డాక్టర్ ఐ. మోత్య, జిల్లా మలేరియా అధికారి కె. వెంకటేశ్వర్లు, సీఈఆర్టీఎస్ ప్రోగ్రాం మేనేజర్ ఎస్కే నసీరుద్దీన్, అదనపు డీఎంహెచ్ఓ (ఎయిడ్స్ & లెప్రసీ), డీటీసీఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు.




