Khammam: పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.. ఖమ్మం కలెక్టర్ దివాకర!

Khammam: ఖమ్మం జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు. 8 జిన్నింగ్ మిల్లులు నోటిఫై. 8-12% లోపు తేమ ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ దివాకర టిఎస్ సూచన.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 7 Oct 2026 1:52 PM IST
Khammam
X

Khammam: పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.. ఖమ్మం కలెక్టర్ దివాకర!

Khammam: 2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తిని కనీస మద్దతు ధర క్రింద విక్రయించేందుకు రైతులు పత్తిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

8 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై :

2026–27 సీజన్‌లో ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం 8 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా ప్రాంతాల్లోని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు పత్తిని తీసుకువచ్చే ముందు తమకు సంబంధించిన కొనుగోలు కేంద్రం, జిన్నింగ్ మిల్లు వివరాలను ముందుగానే తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. నోటిఫై చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి కనీస మద్దతు ధర ప్రయోజనం పొందాలని తెలిపారు.

తేమ శాతాన్ని ముందుగానే పరీక్షించుకోవాలి:

పత్తిలో తేమ శాతం నాణ్యత, ధరపై ప్రభావం చూపుతున్నందున రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు తేమ శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 129 రైతు వేదికల్లో మాయిశ్చర్ మీటర్ల ద్వారా పత్తిలో తేమ శాతాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

రైతులు తాము పండించిన పత్తిని సాధ్యమైనంత వరకు 8 శాతం లోపు తేమ ఉండేలా ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. 8 శాతానికి మించి తేమ ఉన్నప్పుడు ప్రతి అదనపు ఒక్క శాతం తేమకు రూ.86.67 చొప్పున ధరలో తగ్గింపు ఉంటుందని అధికారులు తెలిపారు. పత్తిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుని తీసుకురావడం ద్వారా ధరలో కోతను నివారించవచ్చని అన్నారు.

కౌలు రైతులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి:

కౌలు రైతులు సిసిఐ ద్వారా కనీస మద్దతు ధర క్రింద పత్తిని విక్రయించేందుకు అవసరమైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ (Temporary Registry) ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

సిసిఐ ద్వారా పత్తి విక్రయించే సమయంలో రైతు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ఆథెంటికేషన్ చేయించుకోవాలని, వేలిముద్రలు సరిపోని సందర్భాల్లో ఐరిస్ స్కాన్, ముఖ ధృవీకరణ లేదా ఓటిపి విధానం ద్వారా ఆధార్ ధృవీకరణ చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఓటిపి విధానం వినియోగించాలంటే ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండాలని సూచించారు.

ఆధార్ నంబర్ లేని రైతులు ఆధార్ నమోదు గుర్తింపు పత్రంతో పాటు పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం గుర్తించిన ఇతర గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్:

2026–27 సీజన్‌లో సిసిఐ ద్వారా కనీస మద్దతు ధర క్రింద పత్తిని విక్రయించేందుకు రైతులు ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ నంబర్, ఓటిపి ద్వారా యాప్‌లో లాగిన్ అయి సిసిఐ కి పత్తి విక్రయించేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు కేంద్రాల వివరాలు, పత్తి విక్రయ వివరాలు, తక్పట్టి, చెల్లింపులు తదితర వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. రైతులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కనీస మద్దతు ధర పథకం ప్రయోజనాలను పొందాలని సూచించారు.

రైతుల సందేహాల నివృత్తికి వాట్సాప్ హెల్ప్‌లైన్ 8897281111, ‘కపాస్ కిసాన్’ యాప్ టోల్‌ఫ్రీ నంబర్ 18005995779 ను సంప్రదించాలని తెలిపారు.

పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు:

పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు సమన్వయంతో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, రైతులకు నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం, కొనుగోలు కేంద్రాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు.

రైతులు కూడా చివరి సమయంలో ఇబ్బందులు పడకుండా తేమ శాతాన్ని పరీక్షించుకోవడం, అవసరమైన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం, ఆధార్ ధృవీకరణకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం, తమకు సంబంధించిన జిన్నింగ్ మిల్లు/కొనుగోలు కేంద్రం వివరాలను తెలుసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.