Khammam: దంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Khammam: ఖమ్మం దంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్.. అధికారులకు కీలక ఆదేశాలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 19 Sept 2026 7:03 PM IST
Khammam
X

Khammam: దంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Khammam: గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. శనివారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని దంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వినాయక నిమజ్జనం పురస్కరించుకొని కావాలసిన సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో గణేష్ ఉత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులో నీటిమట్టం ఉన్నందున బారికేడింగ్, గజ ఈతగాళ్లు, క్రేన్లు, బోట్లు, రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసులతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, రాత్రి నిమజ్జనాలకు తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ముందుగానే సిద్ధం చేసి, అత్యవసర వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు.

ఎత్తు కలిగిన గణేష్ విగ్రహాలకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక రూట్, ట్రాఫిక్, పోలీసు బందోబస్తు, రవాణా ఏర్పాట్లు ముందుగానే చేయాలని ఆదేశించారు.

భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.

ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, 108 వాహనం, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని నియమించి నిరంతరం పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లకు అదనపు డ్రైవర్లు, క్రేన్ మరమ్మతులు చేసే మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. విగ్రహాల తరలింపుకు అడ్డుగా వచ్చే చెట్టు కొమ్మలను ముందుగానే తొలగించాలని అన్నారు.

నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలని, స్విమ్మర్లతో ముందుగానే చర్చించి వారికి విధుల షిఫ్ట్ వివరాలను తెలియజేయాలని అన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్‌ను ముందుగానే సిద్ధం చేయాలని, అన్ని శాఖలు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.