Khammam: ఖమ్మంలో ఘనంగా ప్రారంభమైన ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలు
Khammam: ఖమ్మంలో AIKMS 4వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. రైతాంగ పోరాటాలు, భూ సమస్యలు, కార్పొరేట్ దోపిడీపై జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు.
Khammam: ఖమ్మంలో ఘనంగా ప్రారంభమైన ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలు
ఖమ్మం: అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) 4వ జాతీయ మహాసభలు నేడు ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. గత జాతీయ మహాసభల నుంచి నేటి వరకు సంఘం నిర్వహించిన కార్యక్రమాలు, చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలను వివరిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ వివరమైన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.
దానిలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం సాగించిన పోరాటాల్లో AIKMS చురుకైన పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సాగిన రైతాంగ ఉద్యమంలో AIKMS విస్తృతంగా పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేసిందన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రైతాంగ ఉద్యమం సాధించిన విజయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ ఉద్యమం ద్వారా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో రైతాంగంతో AIKMS సంబంధాలు విస్తృతమయ్యాయని, సంస్థకు కొత్త ప్రాంతాల్లో పరిచయాలు ఏర్పడి ఉద్యమ విస్తరణకు మార్గం ఏర్పడిందని తెలిపారు. ఉద్యమ సందర్భంగా ఎదురైన అనుకూల, ప్రతికూల అనుభవాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు వాటిని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
భూమి సమస్యపై నిరంతర పోరాటాలు
దేశవ్యాప్తంగా భూమి సమస్యపై AIKMS నిర్వహించిన పోరాటాలను నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భూమిలేని పేదలు, రైతులు, కౌలు రైతులు, దళితులు, ఆదివాసీల భూమి సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు.
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రతిఘటిస్తూ అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రైతాంగాన్ని, భూమిపై ఆధారపడిన ప్రజలను సమీకరించి పోరాడినట్లు కొన్ని విజయాలు సాధించినట్లు ఇది కిలో పేర్కొన్నారు. భూస్వాములు భూకబ్జా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియాలకు వ్యతిరేకంగా కూడా ఉత్తర ప్రదేశ్ పంజాబ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పోరాటాలు సాగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పంజాబ్ లో దళితులకు భూమి సాధించేందుకు నిర్వహించిన పోరాటాలను, పోలీసుల నిర్బంధాన్ని, వందలకొద్దీ మూడు నెలలు జైల్లో గడిపిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు
ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణ, అడవుల ఆక్రమణ, సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా AIKMS వివిధ ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేసిందని డాక్టర్ ఆశిష్ మిట్టల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఆదివాసీలను విస్తృతంగా సమీకరించి భూమి, అడవి, సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాటాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ ప్రాంతాల్లో స్థానిక సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా దీర్ఘకాలిక ఉద్యమాలను నిర్మించాలని సూచించారు.
MSP కోసం పోరాటం
రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో AIKMS క్రియాశీలంగా పాల్గొన్నదని నివేదికలో పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తికి గిట్టుబాటు ధర, రుణభారం నుంచి విముక్తి, రైతుల జీవన భద్రత వంటి అంశాలను భవిష్యత్ పోరాటాల్లో మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
MGNREGA స్థానంలో VB-GRAMGకు వ్యతిరేకంగా ఉద్యమం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ను బలహీనపరిచి, దాని స్థానంలో VB-GRAMG వంటి కొత్త విధానాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ AIKMS దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు నిర్మించిందని డాక్టర్ సతీష్ మిట్టల్ తెలిపారు.
గ్రామీణ పేదలకు ఉపాధి హామీ, కూలీలకు పని దినాలు, వేతనాలు, సామాజిక భద్రత వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
సంస్థాగత బలోపేతమే ముందున్న ప్రధాన కర్తవ్యం
గత కాలంలో జరిగిన పోరాటాల విజయాలను సమీక్షించుకోవడంతో పాటు, వాటి నుంచి సంస్థాగత నిర్మాణానికి అవసరమైన పాఠాలను నేర్చుకోవాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సూచించారు.
సంఘ నిర్మాణాన్ని బలోపేతం చేయండి
సభ్యత్వాన్ని గణనీయంగా పెంచడం, ప్రతి గ్రామంలో సంఘాన్ని నిర్మించడం, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను బలోపేతం చేయడం, రాష్ట్ర కమిటీలను మరింత క్రియాశీలంగా తీర్చిదిద్దడం అత్యంత ప్రాధాన్యమైన కర్తవ్యాలని తెలిపారు.
రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, దళితులు, ఆదివాసీలు, గ్రామీణ పేదల వాస్తవ సమస్యలను గుర్తించి వాటిపై నిరంతర పోరాటాలు నిర్వహించడం ద్వారానే సంఘాన్ని విస్తృత ప్రజా సంస్థగా బలోపేతం చేయగలమని నివేదిక స్పష్టం చేసింది.
గత పోరాటాల అనుభవాలను సమీక్షించుకొని, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన సంస్థాగత పునాదులను నిర్మించడమే నాల్గవ జాతీయ మహాసభల ముందున్న ప్రధాన లక్ష్యమని డాక్టర్ ఆశిష్ మిట్టల్ పేర్కొన్నారు.
మహాసభలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ నివేదికపై చర్చిలో పాల్గొని నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి అధ్యక్ష వర్గంగా వేములపల్లి వెంకటరామయ్య సుశాంత్ జై చలపతిరావు రవీందర్ సింగ్ తదితరులు వ్యవహరించారు.




