Khammam: పంట రుణాల పంపిణీ లక్ష్యాలను తక్షణమే సాధించాలి

Khammam: ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో పంట రుణాలు, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ఎస్‌హెచ్‌జీ రుణాలపై అదనపు కలెక్టర్ సమీక్ష.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 25 Nov 2026 4:06 PM IST
Khammam
X

Khammam: పంట రుణాల పంపిణీ లక్ష్యాలను తక్షణమే సాధించాలి

ఖమ్మం: జిల్లాలో పంట రుణాల పంపిణీ లక్ష్యాలను తక్షణమే సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించి, రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని వివిధ పథకాల కింద రుణాల మంజూరు, పంపిణీ పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2026 వరకు జిల్లాలో పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.5,266 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.2,035 కోట్లు మాత్రమే పంపిణీ చేసి 39 శాతం లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. గత జాబితాతో పోలిస్తే పంట రుణాల పంపిణీలో 4 శాతం తగ్గుదల నమోదైందని, దీనిని తక్షణమే మెరుగుపరచాలని సూచించారు. పంట రుణాల రెన్యూవల్స్‌ను వేగవంతం చేయాలని, ఎస్‌బీఐ, యూబీఐ సహా అన్ని బ్యాంకులు తమ పరిధిలోని బ్రాంచీల వారీగా రుణాల పంపిణీని సమీక్షించి లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.పంట రుణాల పంపిణీ తక్కువగా ఉండటానికి గల కారణాలను గణాంకాలు, వాస్తవ వివరాలతో విశ్లేషించి నివేదిక సమర్పించాలని సూచించారు.

పీఎం విశ్వకర్మ పథకం క్రింద జిల్లాలో 4,165 దరఖాస్తులు రాగా, వాటిలో 1,595 దరఖాస్తులకు రుణాలు మంజూరయ్యా యని, 2,055 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. మరో 515 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని సూచించారు. మంజూరైన రుణాలు కూడా త్వరితగతిన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు నవంబర్ వరకు రూ.768 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.563 కోట్లు పంపిణీ చేసి సుమారు 73 శాతం లక్ష్యాన్ని సాధించారని పేర్కొన్నారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. మెప్మా ద్వారా మొత్తం 514 యూనిట్లు గ్రౌండింగ్ కాగా, 335 యూనిట్లకు రుణాలు మంజూరైనప్పటికీ ఇంకా పంపిణీ కాలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను వెంటనే విడుదల చేసి లబ్ధిదారులు స్వయం ఉపాధి కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలన్నారు.

జిల్లాలోని మొత్తం 19,857 స్వయం సహాయక సంఘాల్లో 2,813 సంఘాలకు సంబంధించిన రుణ ఖాతాలు క్రమబద్ధంగా లేవని, వీటి రుణ బకాయిల విలువ రూ.61.24 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 1.85 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) శాతాన్ని మరింత తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రుణ బకాయిల వసూళ్లకు సంఘాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని, బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రికవరీని మెరుగుపరచాలని ఆదేశించారు.

పీఎం స్వనిధి పథకం క్రింద జిల్లాలో 40,764 మంది వీధి వ్యాపారులు రుణాలకు అర్హులుగా ఉండగా, ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా 38,689 మందికి రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే తీసుకున్న రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించిన వీధి వ్యాపారులకు నిబంధనల ప్రకారం తదుపరి విడత రుణాలు అందించాలని సూచించారు. వీధి వ్యాపారులు ప్రైవేటు వ్యక్తులు, అధిక వడ్డీకి రుణాలు ఇచ్చే వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి వీధి వ్యాపారికి ప్రభుత్వ పథకాల ద్వారా రుణ సదుపాయం అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని తెలిపారు.

జిల్లాలో తయారీ రంగం అభివృద్ధికి బ్యాంకర్లు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన రుణ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. బ్యాంకులు తమ రుణ ప్రణాళికలను సమీక్షించి తయారీ రంగానికి రుణాల కేటాయింపులు పెంచాలని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించాలని అన్నారు. ట్రేడింగ్ రంగానికి కూడా అవసరమైన రుణ సహకారం అందించాలని సూచించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలకు సంబంధించిన రుణాల పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, అర్హులైన దరఖాస్తుదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. ప్రతి బ్యాంకు తనకు కేటాయించిన లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని, సాధించిన పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, స్వయం ఉపాధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ. రవి ప్రసాద్, ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యశ్వంత్ సాయి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా. పురందర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, అధికారులు, వివిధ బ్యాంకుల ప్రాంతీయ మేనేజర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.