Khammam: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి!
Khammam: ఖమ్మంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశం. లోపాలున్న కేంద్రాలపై చర్యలు.
Khammam: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి!
Khammam: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం–2010ను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వైద్య సేవలందించే సంస్థలు నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్–2010 క్రింద జిల్లా స్థాయి అప్రోప్రియట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రామారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం అమలు, రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, తనిఖీలు, ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నస్టిక్ కేంద్రాల స్థితిగతులపై కమిటీ సమీక్షించింది.
పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ పూర్తి చేయాలి :
జిల్లాలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రుల పర్మినెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియను వచ్చే నెలలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియలో నిబంధనలు, కనీస ప్రమాణాలు, అవసరమైన అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
పార్కింగ్ విషయంలో ఆసుపత్రుల వర్గీకరణ :
ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే సమయంలో పార్కింగ్ సౌకర్యాన్ని పరిశీలించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో పార్కింగ్ సదుపాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అదే సమయంలో 10 పడకల లోపు ఉన్న నర్సింగ్ హోమ్‌ల విషయంలో పార్కింగ్ అంశాన్ని అనవసరంగా ప్రతిబంధకంగా మార్చకుండా, నిబంధనలకు అనుగుణంగా వాటిని వర్గీకరించి, అర్హత ఉన్న సంస్థలకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
లోపాలున్న డయాగ్నస్టిక్ కేంద్రాలపై కఠిన చర్యలు :
జిల్లాలో ఇప్పటికే 16 డయాగ్నస్టిక్ కేంద్రాలను తనిఖీ చేయగా, పలు లోపాలు గుర్తించినట్లు అధికారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసి, గుర్తించిన లోపాలను నిర్దేశిత గడువులోగా సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. లోపాలను సరిదిద్దని సంస్థలకు రిజిస్ట్రేషన్ ఇవ్వకూడదని, గడువు అనంతరం కూడా నిబంధనలు పాటించని సంస్థలపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం సంస్థలను సీజ్ చేసి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సమీక్ష :
2026 జూలై 27 నుంచి ఇప్పటి వరకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 29 దరఖాస్తులు అందగా, 20 ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు, 9 దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నట్లు సమావేశంలో తెలిపారు. పర్మినెంట్/రెన్యువల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 52 దరఖాస్తులు అందగా, 16 దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నట్లు, 24 దరఖాస్తులను ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పంపినట్లు వివరించారు. ట్రాఫిక్ అంశం కారణంగా 3 దరఖాస్తులకు సిఫార్సు చేయలేదని అధికారులు తెలిపారు.
నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు :
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం వైద్య సంస్థలు రిజిస్ట్రేషన్, మౌళిక సదుపాయాలు, సిబ్బంది, పరికరాలు, రికార్డుల నిర్వహణ తదితర కనీస ప్రమాణాలను పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు ముందుగా నోటీసులు జారీ చేసి, నిర్దేశిత గడువులోగా లోపాలను సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని, గడువు అనంతరం కూడా నిబంధనలు పాటించని సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం అమలును మరింత పటిష్టం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. నరేందర్, కమిటీ సభ్యులు, సంబంధిత వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




