Bhadrachalam: భద్రాచలంలో 70వ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం!
Bhadrachalam: భద్రాచలంలో 70వ మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం. విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ విద్యార్థులకు పిలుపు.
Bhadrachalam: భద్రాచలంలో 70వ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం!
భద్రాచలం సెప్టెంబర్ 18: పాఠశాల స్థాయిలో విద్యార్థులకు విద్యతో పాటు వారిలోని క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన బాధ్యత ఇటు ఉపాధ్యాయులకి అటు సమాజానికి ఎంతో ఉందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.
ఈరోజు భద్రాచలంలోని గురుకులం జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 70వ మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని, దీనిని గమనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సమిష్టిగా సహాయ సహకారాలు అందించాలని రాహుల్ పిలుపునిచ్చారు.
పరిస్థితులకు అనుగుణంగా మనము కూడా మారాలని, ప్రస్తుత సమాజంలో వస్తున్న నూతన టెక్నాలజీని సక్రమముగా వినియోగించుకుంటూ మంచి సమాజానికి మనందరం భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ మాట్లాడుతూ ప్రతి పిల్లవాడు చదువు నేర్చుకుంటూ ఆటలలో రాణించాలని, ఏజెన్సీ భద్రాచలానికి అన్ని రంగాలలో ఒక ప్రత్యేకత సంతరించుకుందని దాన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు.
మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో మంచి పునాది కోసం గత సంవత్సరం నుండి ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాన్ని ప్రాథమిక స్థాయి నుండి ప్రారంభించామని దీనికోసం ప్రతి ఉపాధ్యాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు విద్యార్థుల్లో క్రీడలు పై స్ఫూర్తి పెంపొందించుకోవడానికి
పాఠశాల స్థాయి, మండల స్థాయి, జోనల్ స్థాయిలోను క్రీడలను నిర్వహించటం అభినందనీయమని ఆయన అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 70 వ మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిడిఏ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని ఆయన అన్నారు.




