Chintoor: చింతూరు డివిజన్‌లో గోదావరి వరద పరిస్థితుల పరిశీలన!
Chintoor: చింతూరు డివిజన్‌లో గోదావరి, శబరి నదుల వరద పరిస్థితులను ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
Chintoor: చింతూరు డివిజన్‌లో గోదావరి వరద పరిస్థితుల పరిశీలన!
Chintoor: చింతూరు డివిజన్‌లో గోదావరి,శబరి నదుల వరద పరిస్థితులను చింతూరు ఐటీడీఏ పిఓ శుభం నోఖ్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కూనవరం వంతెన వద్ద గోదావరి–శబరి నదుల సంగమ ప్రాంతంలో వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించి,సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారి సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని,కూనవరం మండల స్థాయి బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించాలని ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు.గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ప్రాజెక్ట్ అధికారి కన్నాయిగూడెం నుంచి చింతరేగిపల్లి బ్లాక్ పాయింట్ వరకు పర్యటించి, బ్లాక్ పాయింట్ వద్ద దేశీ పడవల లభ్యతను పరిశీలించారు.వరద పరిస్థితుల్లో రవాణాకు ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన పడవలు, ఇతర సహాయక వనరులు సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టామని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు.
కంది పప్పు, పామాయిల్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకులను ఒకటి లేదా రెండు రోజుల్లో వరద ప్రభావిత ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే గ్రామస్థాయి లేదా మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎటపాక యూనిట్–1 ఎస్‌డీసీ జి. బాలకృష్ణ, కూనవరం యూనిట్–2 ఎస్‌డీసీ వెంకటేశ్వర్లు, వీఆర్ పురం యూనిట్–2 ఎస్‌డీసీ అంజనేయులు, వీఆర్ పురం తహసీల్దార్ సరస్వతి, ఎటపాక సీఐ కృష్ణ, వీఆర్ పురం ఎస్‌ఐ షేక్ సాదిక్ ,కూనవరం ఎస్‌ఐ రామకృష్ణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




