Khammam: రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేసేలా ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్!

Khammam: ఖమ్మం జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేసేలా 15 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం ఆదేశించారు.

K SRINIVAS RAO, KHAMMAM TOWN
Published on: 27 Nov 2026 2:12 PM IST
Khammam
X

Khammam: రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేసేలా ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్!

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, వాటి నిర్వహణ, నిధుల సమీకరణ, తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ, రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలకు అనుగుణంగా సేవలను విస్తరించాలని తెలిపారు.

ఆధునిక పరికరాలతో రక్తదాన శిబిరాలు:

రక్తదాన శిబిరాలను ఆధునిక రక్త పరీక్ష పరికరాలు, రక్త సంబంధిత యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్త నిల్వ కేంద్రం, ప్లాస్మా సరఫరా వంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అవసరమైన సొంత భవనం ఏర్పాటు, అందులో కల్పించాల్సిన వైద్య సదుపాయాలపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అవసరమైన ప్రాంతాలు, కార్యక్రమాలను గుర్తించాలని సూచించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు ఆదర్శవంతంగా, సమర్థవంతంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధిస్తే గవర్నర్ ద్వారా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ దిశగా సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

విద్యార్థులు, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి:

డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సరైన దిశానిర్దేశం అవసరమని కలెక్టర్ తెలిపారు. యువతను క్రమపద్ధతిలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగానికి విద్యార్థులు, యువత దూరంగా ఉండేలా నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

రక్తదాన, నేత్రదాన శిబిరాలతో పాటు సమాజానికి ఉపయోగపడే ఇతర సేవా కార్యక్రమాలను తరచూ చేపట్టాలని సూచించారు. నిరంతరంగా, సుస్థిరంగా చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారానే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

15 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక:

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మొదటి సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి నిర్వహణ విధానం, అవసరమైన మౌళిక సదుపాయాలు, నిధుల సమీకరణ తదితర అంశాలతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వచ్చే 15 రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, ఖమ్మం జిల్లాకు అనువైన ఉత్తమ కార్యాచరణను రూపొందించాలని తెలిపారు. సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిన అనంతరం జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ డాక్టర్ జి. వెంకటేశ్వర్లు, వైస్ చైర్మెన్ కే. కిరణ్ కుమార్, కార్యదర్శి కె. సత్యనారాయణ, కోశాధికారి రాఘవరావు, సభ్యులు కె.గోపాల్ రావు, బి. శ్రీనివాసులు, జయంతి లాల్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు కే.రవీందర్, ఇతర సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

K SRINIVAS RAO, KHAMMAM TOWN

K SRINIVAS RAO, KHAMMAM TOWN