Khammam: మహనీయుల విగ్రహాల ప్రతిపాదనలను నిబంధనల ప్రకారం పరిశీలించాలి: కలెక్టర్!
Khammam: ఖమ్మం జిల్లాలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గురువారం ఆదేశించారు.
Khammam: మహనీయుల విగ్రహాల ప్రతిపాదనలను నిబంధనల ప్రకారం పరిశీలించాలి: కలెక్టర్!
ఖమ్మం: ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యాసాధ్యాలు, స్థల కేటాయింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్‌లో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలు, స్థలాల గుర్తింపు, జంక్షన్ల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జిల్లాలో విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలకు అనుగుణంగా అందిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
బోనకల్ క్రాస్ రోడ్ వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ సమీపంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చినట్లు తెలిపారు. మధిర అగ్రికల్చర్ మార్కెట్ సర్కిల్ వద్ద ఫౌంటెన్ నిర్మాణం చేపట్టి, జంక్షన్ అభివృద్ధి పనులు నిర్వహించిన అనంతరం అక్కడ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మధిర మండలం ఆత్కూరు గ్రామంలో భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం, మధిర పట్టణంలోని వార్డు నంబర్ 1లో సుశీల కాలేజీ సమీపంలో వంగవీటి మోహన రంగ విగ్రహం ఏర్పాటు, ఖమ్మం నగరంలో వంగవీటి మోహన రంగ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్‌బండ్ వద్ద పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనలను కూడా సమావేశంలో సమీక్షించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విగ్రహాల ఏర్పాటుతో భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు, ట్రాఫిక్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జంక్షన్ల అభివృద్ధి పనుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విగ్రహాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. బోనకల్ క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహం, మధిర అగ్రికల్చర్ మార్కెట్ సర్కిల్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం, ఆత్కూరు గ్రామంలో జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి జంక్షన్ల అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా అనుమతులు జారీ చేయాలని సూచించారు.
అంబేద్కర్, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, సంబంధిత జంక్షన్ల అభివృద్ధి అనంతరం మాత్రమే విగ్రహాల ఏర్పాటు చేపట్టేలా ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొనాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం నగరంలో వంగవీటి మోహన రంగ విగ్రహం ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత కమిటీ ముందు ఉంచాలని, ప్రతి ప్రతిపాదనపై కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ఏదైనా విగ్రహం ఏర్పాటు వల్ల అభ్యంతరాలు, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని ముందుగానే పరిశీలించాలని తెలిపారు.
ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలపై కమిటీ సభ్యుల నుంచి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
విగ్రహాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ప్రజా ప్రయోజనాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యుగంధర్ రావు, డిపిఓ వినోద్ కుమార్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీ అధికారులు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. అశోక్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.




