Khammam: సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం!

Khammam: సత్తుపల్లిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 2 Nov 2026 1:08 PM IST
Khammam
X

Khammam: సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం!

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సత్తుపల్లి, పెనుబల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

మాజీ మంత్రి హరీష్ రావును అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.మియాపూర్ భూముల వ్యవహారంపై మాట్లాడుతూ 2017లో మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సర్వే నంబర్లు 100, 101లో రిజిస్ట్రేషన్లను నిలిపివేయించారని గుర్తుచేశారు.

ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఐడీ విచారణకు ఆదేశించి, పోలీసు కేసులు నమోదు చేయించారని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అధికారుల పాత్ర బయటపడటంతో వారిపై కూడా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. 1997, 2003లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకుని ఆ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం భూ కబ్జాదారుల చెరలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లారని తెలిపారు. ఇందులో భాగంగా 2015లో సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను ప్రత్యేక న్యాయవాదిగా నియమించారని గుర్తుచేశారు.

2015 ఏప్రిల్ 7 నుంచి 2023 వరకు ఎనిమిదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మియాపూర్ భూముల వ్యవహారంలో న్యాయపోరాటం కొనసాగించిందని, సమగ్ర నివేదికలు, అఫిడవిట్లు, కీలక పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించిందని వివరించారు.2023 జూన్ 15న ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్, గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన భూముల కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించిందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉందని అన్నారు.

ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుదీర్ఘ న్యాయపోరాటానికి కొనసాగింపుగానే ప్రస్తుత తుది తీర్పు వచ్చిందని, అయితే మొత్తం ఘనత తన ప్రభుత్వ కృషి వల్లే సాధ్యమైందన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు.

రైతుల సమస్యలపై స్పందిస్తూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో పంటలు సరిగా పండక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన కొద్దిపాటి పంట కూడా నీటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 28 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించిందని, ఇది ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. 2026 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటు కూడా అత్యంత కీలకమని, ప్రతి ఓటును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి ఓటరు నమోదు చేయించాలని, గ్రామాల వారీగా గ్రామ పంచాయతీ కార్యాలయాల (GPO) వద్ద అర్హుల జాబితాలను సేకరించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. నవంబర్ 6వ తేదీ ఓటరు నమోదు చివరి తేదీ కావడంతో మిగిలిన నాలుగు రోజులు నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సత్తుపల్లి, పెనుబల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటు నమోదు చేయించి పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.

ఈ కార్యక్రమంలో కూసంపూడి రామారావు, బొడ్డు శివ బాబు, మండలపు ప్రభాకర్, చక్కిలాల లక్ష్మణ్ రావు, చక్కిలాల మోహన్ రావు, భాను, కోటగిరి సుధాకర్ బాబు, మండలపు అశోక్, టీవీ రామారావు, చింతల సురేందర్ రెడ్డి తదితరులున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI